సరైన విజయాలు లేక బాలీవుడ్ ఇబ్బందులు పడుతున్నది. స్టార్ హీరోల సినిమాలు బాక్సాఫీస్ వద్ద అపజయం పాలవుతున్నాయి. ఈ పరిస్థితిపై స్పందించారు మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్. ఆయన తాజా పాన్ ఇండియా చిత్రం ‘సీతా రామం’ మంచి విజయాన్ని సాధించింది. హిందీ చిత్ర పరిశ్రమ పరిస్థితిపై దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ…‘ప్రేక్షకులకు నచ్చని సినిమా చేయాలని ఎవరూ అనుకోరు.
మనం ఎంచుకున్న కథలతో కొన్నిసార్లు ప్రేక్షకులను మెప్పించ లేకపోతాం. ఇది ప్రతి ఇండస్ట్రీలోనూ జరుగుతుంది. కొన్నేళ్ల క్రితం చాలా మలయాళ సినిమాలు నాకు నచ్చేవి కావు. ప్రేక్షకుల్ని అలరించడంలో బాలీవుడ్‌కు ఘనమైన చరిత్ర ఉంది. ప్రస్తుతం ఒడిదొడుకుల్లో ఉన్నంత మాత్రాన మనం హిందీ సినిమా విజయాలను మర్చిపోకూడదు’ అని చెప్పారు.