e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, May 11, 2021
Home News శ్రీకారం రివ్యూ..మంచి సందేశంతో కూడుకున్న చిత్రం

శ్రీకారం రివ్యూ..మంచి సందేశంతో కూడుకున్న చిత్రం

శ్రీకారం రివ్యూ..మంచి సందేశంతో కూడుకున్న చిత్రం

తెలుగు చిత్రసీమలో కొత్తదనాన్ని నమ్మి సినిమాలు చేసే హీరోల్లో శర్వానంద్‌ ఒకరు. ఇమేజ్‌తో పట్టింపులు లేకుండా కథ, దర్శకుల ప్రతిభకు ప్రాముఖ్యతనిస్తుంటారాయన. ఆ కోవలోనే శర్వానంద్‌  చేసిన తాజా చిత్రం ‘శ్రీకారం’. సందేశాత్మక కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రంతో కిషోర్‌ దర్శకుడిగా తెలుగు చిత్రసీమకు పరిచయం అయ్యారు. కొత్త దర్శకుడిని నమ్మి శర్వానంద్‌ చేసిన ఈ చిత్రం ఆయనకు ఎలాంటి ఫలితాన్ని అందించిందో తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే..

కార్తిక్‌(శర్వానంద్‌) పల్లెటూరికి చెందిన కుర్రాడు. సిటీలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తుంటాడు. తన తెలివితేటలతో అమెరికా వెళ్లే అవకాశాన్ని దక్కించుకుంటాడు. కానీ వ్యవసాయంపై మక్కువతో అమెరికా  ఆఫర్‌ను వదులుకున్న కార్తిక్‌ తిరిగి తన గ్రామానికి వస్తాడు. కార్తిక్‌  నిర్ణయాన్ని అతడి తండ్రి కేశవులు(రావురమేష్‌) వ్యతిరేకిస్తాడు. వ్యవసాయం కారణంగా కేశవులు అప్పుల పాలవుతాడు. తన మాదిరిగా కొడుకు ఇబ్బందులు పడకూడదని తపన పడుతుంటాడు. కేశవులు మాదిరిగానే ఆ ఊరిలోని చాలా మంది రైతులు వ్యవసాయం చేయడం ఇష్టం లేక ఊరొదిలి పట్టణాలకు వలసపోతారు.  తండ్రి వద్దనుకున్న వ్యవసాయాన్ని కార్తిక్‌ స్వీకరించాడా? వ్యవసాయం లాభసాటి అని తన ఊరి వారందరికి ఎలా చాటిచెప్పాడు? కార్తిక్‌ గొప్పతనాన్ని అతడి తండ్రి కేశవులు గుర్తించాడా? కార్తిక్‌ ప్రయాణంలో చైత్ర(ప్రియాంక అరుల్‌మోహన్‌) అతడికి ఏ విధంగా అండగా  నిలిచిందన్నదే ఈ చిత్ర ఇతివృత్తం. 

ఉమ్మడి వ్యవసాయం వలన కలిగే ప్రయోజనాల్ని  ఆవిష్కరిస్తూ తెరకెక్కించిన చిత్రమిది. ఆధునిక సాంకేతిక పద్దతుల్ని ఉపయోగిస్తూ వ్యవసాయం చేయడం వలన వ్యయాల్ని తగ్గించుకుంటూ అధికంగా లాభాల్ని గడించే అవకాశం ఉంటుందనే పాయింట్‌కు రైతులు పడే కష్టాల్ని, కుటుంబ విలువల్ని జోడిస్తూ దర్శకుడు కిశోర్‌ ఈ కథను రాసుకున్నారు. అప్పుల భారాన్ని భరించలేక పల్లెల్ని వదిలి పట్టణాల్లో కూలీలుగా మారిన  రైతుల వ్యథల్ని హృద్యంగా చూపిస్తూ తండ్రీ కొడుకుల అనుబంధానికి పెద్దపీట వేస్తూ ఎమోషనల్‌ డ్రామాగా సినిమాను తీర్చిదిద్దారు. 

 కార్తిక్‌, చైత్ర లవ్‌స్టోరీతో సినిమా ప్రథమార్థం  సరదాగా సాగుతుంది. తనను ప్రేమించమంటూ చైత్ర చేసే అల్లరి పనులన్నీ నవ్విస్తాయి. తండ్రితో పాటు తన ఊరి రైతులు పడే కష్టాల్ని చూసి చలించిపోయిన కార్తిక్‌ వ్యవసాయం చేయాలనే  నిర్ణయించుకొని ఉద్యోగాన్ని వదిలిపెట్టే సన్నివేశం కథలో వేగం పెరిగింది. వ్యవసాయం చేయడంపై ఆశలు వదులుకున్న రైతుల్లో కార్తిక్‌ ఐకమత్యాన్ని  నింపుతూ వారిని విజయపథంలో ఎలా నడిపించాడో ద్వితీయార్థంలో చూపించారు. పతాక ఘట్టాలు దర్శకుడి ప్రతిభకు అద్దంపట్టాయి. కొడుకు అపార్థం చేసుకున్న తండ్రిలో మార్పు వచ్చే ఘట్టాన్ని సంభాషణలపై ఆధారపడకుండా చిన్న సీన్‌ ద్వారా చూపించి ఆకట్టుకున్నారు. 

తండ్రి ద్వారా వ్యవసాయంపై ఇష్టం పెంచుకున్న యువకుడిగా శర్వానంద్‌ తన పాత్రలో చక్కగా ఇమిడిపోయారు. తండ్రికి తన మనసులోని మాటల్ని చెప్పలేక  సంఘర్షణ పడే కొడుకుగా, తనకు ఇష్టమైన వ్యవసాయంలోనే ఆనందాన్ని వెతుక్కునే రైతుగా ఉద్వేగభరితంగా అతడి పాత్ర సాగుతుంది.  హీరోయిజం లాంటి హంగులపై ఆధారపడకుండా వాస్తవికతకు దగ్గరగా అతడి పాత్రను తీర్చిదిద్దారు.  వ్యవసాయం కారణంగా అప్పుల పాలైన రైతుగా రావురమేష్‌ పాత్ర మనసుల్ని కదిలిస్తుంది. శర్వానంద్‌,  రావురమేష్‌ మధ్య వచ్చే ప్రతి సన్నివేశం  సినిమాను నిలబెట్టింది. శర్వానంద్‌ను ప్రేమించి అల్లరి అమ్మాయిగా ప్రియాంక అరుల్‌మెహన్‌ కనిపించింది. నరేష్‌, సాయికుమార్‌  పాత్రలు కథను రక్తికట్టించడంలో కీలకభూమిక పోషించాయి. 

తాను రూపొందించిన లఘు చిత్రం ఆధారంగానే దర్శకుడు  కిశోర్‌ ఈసినిమాను తెరకెక్కించారు. ఉమ్మడి వ్యవసాయం అంశాన్ని ఆలోచనాత్మకంగా సినిమాలో చూపించారు. ఎమోషన్స్‌ను పండించే సన్నివేశాలన్నీ అతడి  ప్రతిభకు అద్ధంపట్టాయి. అయితే చిన్న పాయింట్‌ను సినిమాగా మలిచే ప్రయత్నంలో కొంత తడబడిపోయారు. శర్వానంద్‌,  రావురమేష్‌ ఎపిసోడ్‌ మినహా మిగిలిన అంశాల్లో ఆసక్తి లోపించింది. చైత్ర, కార్తిక్‌ ప్రేమకథ ఆహ్లాదాన్ని పంచలేకపోగా కేవలం సినిమా నిడివిని పెంచడానికే ఉపయోగపడింది. ఊరిలోని భూముల్ని తన సొంతం చేసుకోవాలనే ఇరవై ఐదేళ్లుగా ఎదురుచూస్తున్న ఏకాంబరం పాత్రలో  హీరో చెప్పిన ఒక్క మాట మార్పు తీసుకురావడం కన్వీన్సింగ్‌గా లేదు. వ్యవసాయం చేయడంలో కార్తిక్‌కు ఎదురయ్యే అవరోధాల్లో ఉత్కంఠ లోపించింది. 

మిక్కీ జే మేయర్‌ స్వరాల్లో ‘వస్తానంటివో పోతానంటివో’ పాట ప్రేక్షకుల్ని అలరిస్తుంది. పల్లె అందాల్ని ఛాయాగ్రాహకుడు యువరాజ్‌ చక్కగా చూపించారు. కమర్షియల్‌ సూత్రాల గురించి ఆలోచించకుండా చక్కటి సందేశాన్ని ప్రేక్షకులకు అందించాలనే ఆలోచనతో నిర్మాతలు గోపీ ఆచంట, రామ్‌ ఆచంట ధైర్యంగా ఈసినిమాను తెరకెక్కించారు. 

వ్యవసాయం గొప్పతనాన్ని చాటిచెబుతూ తెలుగు తెరపై గతంలో వచ్చిన సినిమాలకు భిన్నంగా సాగే చిత్రమిది. కథపై నమ్మకంతో నిజాయితీగా చిత్రబృందం చేసిన ఈ ప్రయత్నాన్ని తెలుగు ప్రేక్షకులు ఏ మేరకు ఆదరిస్తారో వేచిచూడాల్సిందే. 

Advertisement
శ్రీకారం రివ్యూ..మంచి సందేశంతో కూడుకున్న చిత్రం
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement