బతుకమ్మ పండుగ ప్రారంభోత్సవం (ఎంగిలి పూల బతుకమ్మ) సందర్భంగా ఆడపడుచులకు రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతికి బతుకమ్మ వేడుకలు ప్రతీక అని, ప్రకృతిలో సహజంగా దొరికే తీరొక్క పూలను సేకరించి బతుకమ్మను తయారు చేసి ఒకేచోట అందరూ చేరి ఆడుతూ పాడుతూ జరుపుకునే వేడుక బతుకమ్మ అని ఆయన చెప్పారు.
పేద, ధనిక అనే భేదం లేకుండా, కులాలకు అతీతంగా మహిళలు అందరూ కలిసి ఆడుతూ పాడుతూ సంతోషంగా జరుపుకునే వేడుక బతుకమ్మ అని, తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మను అధికారిక రాష్ట్ర పండుగగా గుర్తించిందని తెలిపారు. ప్రతి ఏటా బతుకమ్మ కానుకగా ఆడపడుచులకు చీరలను పంపిణీ చేస్తున్న విషయాన్ని గుర్తుచేసిన ఆయన.. బతుకమ్మ సంబరాలను అందరూ ఆనందంగా జరుపుకోవాలని కోరుకున్నారు.