ఏడాదిలో కొత్తగా 2652 సోలార్ విద్యుత్ కనెక్షన్లు
రోజుకు 208 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి
సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు నగర వాసుల ఆసక్తి
కాలుష్య రహిత విద్యుత్ ఉత్పత్తిపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందుకోసం ప్రత్యేకంగా ప్రోత్సాహకాలు ఇస్తోంది. ఈ క్రమంలోనే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి క్రమంగా పెరుగుతోంది. గత ఏడాది మార్చి నుంచి ఇప్పటి వరకు కొత్తగా 2652 సోలార్ విద్యుత్ ప్లాంట్లను నగరవాసులు తమ నివాసాలపై ఏర్పాటు చేసుకున్నారు. దీంతో ప్రతి రోజూ 208 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి అవుతోంది.
టీఎస్ఎస్పీడీసీఎల్ పరిధిలో …
దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) పరిధిలో 20 సర్కిళ్లు ఉండగా, అందులో గ్రేటర్ హైదరాబాద్‌లోనే 9 సర్కిళ్లు ఉన్నాయి. వీటిలో అత్యధికంగా హబ్సిగూడలో 1600, మేడ్చల్‌లో 1590, బంజారాహిల్స్‌లో 1158, సైబర్ సిటీ సర్కిల్లో 1148, సరూర్‌నగర్‌లో 1087, సికింద్రాబాద్‌లో 1027, హైదరాబాద్ సెంట్రల్లో 624, రాజేంద్రనగర్‌లో 608, హైదరాబాద్ సౌత్‌లో 452 సోలార్ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. డిస్కం పరిధిలోని 20 సర్కిళ్లలో అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న 9 సర్కిళ్లలోనే 10వేల వరకు సోలార్ విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన నెట్ మీటర్ కనెక్షన్లు ఉన్నాయని అధికారులు తెలిపారు. కొత్తగా ఇళ్ల నిర్మాణం చేపడుతున్న వారు ఇంటిపైన 3 కిలోవాట్ నుంచి 75 కిలోవాట్ సామర్థ్యంతో కూడిన సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్యానళ్లను ఏర్పాటు చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు.
నగరవాసులు క్లీన్ ఎనర్జీ…
గ్రీన్ ఎనర్జీ వైపు మొగ్గు చూపుతున్నారు. మారుతున్న జీవన విధానంలో విద్యుత్ వినియోగం అంతకంతకూ పెరుగుతూనే ఉన్నది. ఉత్పత్తి, వినియోగం మధ్య వ్యత్యాసం భారీగా పెరిగిపోతుండడం తో సోలార్ విద్యుత్ ఉత్పత్తే అసలైన ప్రత్యామ్నాయంగా మారింది. – సిటీబ్యూరో, మార్చి 31 (నమస్తే తెలంగాణ)