నత్తగుల్ల లాలాజలానికి చర్మాన్ని కాపాడే గుణం ఉందని కొరియన్లు నమ్ముతారు. చర్మ సంబంధ వ్యాధులకు ఔషధంగా వాడతారు. ప్రపంచ వ్యాప్తంగా కూడా నత్తగుల్లల లాలాజలాన్ని సౌందర్య చికిత్సలో జోడిస్తున్నారిప్పుడు. జిడ్డుగా ఉండే చర్మంపై మొటిమలు ఎక్కువగా రావడమే కాదు, ఒక్కోసారి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వల్లకూడా చర్మం పాడవుతుంది. ఇలాంటి సమస్యల నుంచి బయటపడటానికి నత్తల లాలాజలం ఎంతో ఉపకరిస్తుందని అంటారు.
మొటిమలు, పగుళ్ల సమస్యను కూడా ఇది తగ్గిస్తుందట. అందుకే, నత్త లాలాజలం చర్మానికి పట్టేలా.. స్పాలలో నత్తగుల్లలను ఒళ్లంతా పాకిస్తారు. నత్తగుల్లల లాలాజలాన్ని అందం కోసం వాడిన చరిత్ర గ్రీకులకూ ఉంది. గాయాలను, పగుళ్లను, వాపులను తగ్గించేందుకు దీన్నిఉపయోగించారు. విరిగిన పాలలో నత్తగుల్ల కర్పరం (గవ్వ) పొడి కలిపి రాస్తే పుండ్లు మానిపోతాయని నమ్మేవారు. తాజాగా కొరియన్ కంపెనీల ద్వారా మార్కెట్లోకి ప్రవేశిస్తున్న నత్త ఉత్పత్తులు భారతీయ సౌందర్య సాధనాల పరిశ్రమను ప్రభావితం చేసేలా ఉన్నాయంటున్నారు నిపుణులు.