వైవిధ్యంలో న్యూయార్క్‌ను, పరిశుభ్రతలో టోక్యోను, సామాజిక సేవలో స్టాక్హోమ్ను తలదన్నే అత్యాధునిక కృత్రిమ నగరమొకటి మరో దశాబ్దంలో అందుబాటులోకి రానున్నది. ఆ నగరమే ‘టెలోసా’. ఆ నగర విశేషాలేంటంటే..
తూర్పు అమెరికాలోని ఎడారి నేలల్లో.. పర్యావరణానికి ఎలాంటి హాని జరుగని విధంగా 1.50 లక్షల ఎకరాల్లో ‘టెలోసా’ నగరం రూపుదిద్దుకుంటున్నది. ప్రాథమికంగా 50వేల మంది నివసించేలా నిర్మాణం జరుపుకుంటున్న ఈ నగరాన్ని 2030నాటికి అందుబాటులోకి తీసుకురానున్నట్టు రూపకర్త, వాల్‌మార్ట్ మాజీ సీఈవో మార్క్లోర్ తెలిపారు. నగరంలో వైవిధ్యతకు పెద్దపీట వేస్తామని, నగరంలో శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నవారిని దరఖాస్తు ప్రక్రియ ద్వారా ఎంపిక చేస్తామన్నారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని చెప్పారు. రానున్న 40 ఏండ్లలో మొత్తం 50 లక్షల మంది నివసించేలా ‘టెలోసా’ను మరింతగా విస్తరిస్తామని పేర్కొన్నారు. స్కూళ్లు, కార్యాలయాలకు కేవలం పావుగంటలో చేరుకునేలా ’15 మినిట్ సిటీ డిజైన్’, నీటికి, విద్యుత్తుకు కటకట లేకుండా కరువు నిరోధక జలవ్యవస్థ, స్వయంసమృద్ధి శక్తిఉత్పాదకత ప్రాజెక్టులను డిజైన్ చేసినట్టు వెల్లడించారు. నివాస సముదాయాలు, పార్కులు, స్కూళ్లు, కార్యాలయాలు, మెట్రోస్టేషన్లు, మాల్స్, థియేటర్లు ఇలా సకల వసతులు ‘టెలోసా’లో ఉండనున్నట్టు తెలిపారు.