వనపర్తి టౌన్, మే 24 : ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వానికి స్పష్ణమైన ప్రణాళిక, చిత్తశుద్ధి లేదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆరోపించారు. ఆదివారం వనపర్తి జిల్లా చిట్యాల సమీపంలోని మార్కెట్ యార్డులో తడిసిన ధాన్యాన్ని పరిశీలించి రైతులకు ధైర్యాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి రైతుల పట్ల బాధ్యతారహితంగా మాట్లాడటం బాధాకరమని అన్నారు. ఆరుగాలం కష్టపడి పంటలు పండిస్తే అమ్ముకోలేని దుస్థితిలో రైతులు ఉన్నారని, అందుకు కాంగ్రెస్ సర్కారే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. అర్హత లేనివారికి ట్రాన్స్‌పోర్టు టెండర్లు ఇచ్చారని ఆరోపించారు.
పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర నమ్మకమున్న అధికారి అని, ట్రాన్స్‌పోర్టు టెండర్లో అవకతవకలపై విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు లేఖ రాసి విచారణ చేపట్టాలని కోరారు. ప్రజల సమస్యలపై ప్రశ్నించే గొంతుకలపై కేసులు పెట్టడం ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనమన్నారు. 1.5 కోట్ల టన్నుల వరిధాన్యం మార్కెట్‌కు వస్తే, 45 రోజుల్లో కేవలం 45 లక్షల టన్నులు మాత్రమే కొన్నారని, మిగిలిన ధాన్యాన్ని ఎప్పుడు కొంటారని ప్రశ్నించారు.

మహబూబ్‌నగర్ జిల్లాలో ఆదివారం సాయంత్రం గాలి వాన బీభత్సాన్ని సృష్టించింది. అప్పన్నపల్లి శివారులోని ఐదెకరాల్లో సాగు చేసిన బొప్పాయి పండ్లన్నీ నేలరాలాలి రూ.10 లక్షలకుపైగా నష్టం వాటిల్లింది. మహ్మదాబాద్‌లో దాదాపు వెయ్యి బస్తాల ధాన్యం తడిసి ముద్దయ్యింది. జడ్చర్లలోని బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌తోపాటు పత్తిమార్కెట్ యార్డులో ధాన్యం కుప్పలు, మక్కజొన్న బస్తాలు తడిసిపోయాయి.
– నమస్తే తెలంగాణ నెట్వర్క్