చిత్ర పరిశ్రమలో వారసులకు తొలి చిత్ర అవకాశం రావడం సులభమే కానీ దాన్ని నిలబెట్టుకుని పేరు తెచ్చుకోవడంలోని వారి ప్రతిభ బయటపడుతుంది. ఇలా ప్రతిభ చూపించి తను కేవలం వారసురాలినే కాదని మంచి నటినని నిరూపిస్తా అంటున్నది షనయా కపూర్. నటుడు సంజయ్ కపూర్ కూతురైన షనయా..త్వరలో ‘బేధడక్’ చిత్రంతో ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నది.
ఈ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్ పతాకంపై కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. శశాంక్ కైతాన్ దర్శకుడు. గుర్ఫాతే ఫిర్జాదా, లక్షయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. త్వరలో సెట్స్ మీదకు ఈ సినిమా వెళ్తున్న సందర్భంగా షనయా మాట్లాడుతూ…‘నటి కావాలన్నది నా కల. అది తీరుతున్నందుకు సంతోషంగా ఉంది. మొదటి సినిమా కాబట్టి ఉద్వేగంగా ఉంది. నా దృష్టిలో ఇది తొలి చిత్రమే కాదు నా సుదీర్ఘ ప్రయాణానికి తొలి అడుగు అనుకుంటున్నా. మరో వారసురాలు అని విమర్శిస్తున్నారు. నాకేం తక్కువని తేలికగా చూస్తున్నారు? మీరు మెచ్చేలా నటించి నేనీ అవకాశానికి అర్హురాలినని నిరూపించుకుంటా’అని చెప్పింది.