వాషింగ్టన్: రజినీకాంత్ రోబో సినిమా చూశారా? రెడ్ చిప్‌ను అమర్చిన తర్వాత విలన్‌గా మారిన చిట్టి.. తనను పోలిన వేలాది రోబోలను తయారుచేస్తుంది. తెరపై ఆ దృశ్యాన్ని చూడగానే ఆశ్చర్యంతో ఈలలు వేశాం. అయితే, నిజజీవితంలో ఇలాంటివి జరుగవులే అనుకున్నాం కూడా. అయితే, సృష్టికి ప్రతిసృష్టి చేసే శాస్త్ర విజ్ఞానం దీన్ని నిజంచేసి చూపించింది. ప్రపంచంలోనే మొట్టమొదటి లివింగ్ రోబోట్స్ (సజీవ రోబోలు)గా గుర్తింపు పొందిన ‘ జీనోబాట్ ‘లు పిల్ల రోబోలను ఉత్పత్తి చేశాయి. వందలాది జీనోబాట్లు ఒకదగ్గరగా చేరి బేబీ జీనోబాట్లను ఉత్పత్తి చేశాయని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ వెర్మాంట్, టఫ్ట్స్ యూనివర్సిటీ, వైస్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు తెలిపారు.
రోబో అంటేనే ప్రాణం లేనిదన్న విషయం తెలిసిందే. అయితే, వెర్మాంట్, టఫ్ట్స్, వైస్ వర్సిటీల పరిశోధకులు.. తొలిసారిగా 2020లో జీవమున్న రోబోను సృష్టించారు. మిల్లీమీటర్ కన్నా తక్కువ పరిణామం (0.04 అంగుళం)లో ఉన్న ఈ రోబోకు ‘జీనోబాట్’ అని పేరు పెట్టారు. ‘ఆఫ్రికన్ కప్ప (క్లాడ్ ఫ్రాగ్)’ పిండం నుంచి సేకరించిన మూలకణాలతో వారు ఈ బాట్‌ను తయారుచేశారు. అనంతరం కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో ఈ రోబోకు విజయవంతంగా ప్రోగ్రామింగ్‌ను ప్రాసెస్ చేశారు. ఇలా ‘జీనోబాట్’ ఓ సజీవ రోబోగా తయారైంది.
కప్ప పిండంతో తయారైన ఈ సజీవ రోబో.. తన హృదయ కణాల ప్రకంపనల సాయంతో కదలడంతో పాటు ఈదుతాయి. ఆహారం (ఎంజైమ్స్, ప్రోగ్రామింగ్ కోడ్) లేకుండా వారాల తరబడి బతకగలవు. గుంపులుగా కలిసి పనిచేయగలవు. అవసరాలకు తగినట్టుగా ప్రోగ్రామింగ్ చేసి వినియోగించుకోవచ్చు.
జీనోబాట్ తయారీ ప్రయోగం ఎంతో క్లిష్టంగా సాగింది. కప్ప పిండం నుంచి సేకరించిన మూలకణాలను పొదిగిన శాస్త్రవేత్తలు ఆ జీవమున్న కణాలను ముక్కలుగా చేసి.. సూపర్ కంప్యూటర్ల సాయంతో నిర్ణీత రూపాల్లోకి మార్చారు. సాధారణంగా ఇలా ముక్క లు చేసినప్పుడు ఏ కణమైన తన జీవాన్ని కోల్పోతుంది. అయితే, అనూహ్యంగా ‘జీనోబాట్’లు తమకు జరిగిన గాయాలను తమంతటతామే మాన్పుకొన్నాయి. అందుకే వీటిని ‘సజీవ యంత్రాలు’గా అభివర్ణిస్తున్నారు.
‘జీనోబాట్’ల సాయంతో పుట్టుకతో వచ్చే లోపాలను కణ పరిశోధనల సాయంతో నివారించవచ్చు. శరీరంలో ఏర్పడ్డ అవాంఛనీయ గడ్డలను సాధారణ కణాలుగా రీప్రోగ్రామింగ్ చేయవచ్చు. అవసరమైన శరీర భాగాలకు మందులు చేరవేయొచ్చు. రక్తనాళాల్లోని కొవ్వును తొలగించవచ్చు. వృద్ధాప్యాన్ని కూడా జయించే అవకాశమున్నదని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.