SBI Loans Costly | దేశంలోకెల్లా అతిపెద్ద బ్యాంకు భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ)లో ఇండ్ల రుణాలు మొదలు పర్సనల్ లోన్లు, ఎడ్యుకేషనల్ లోన్లు, వెహికల్ రుణాలు మరింత భారం కానున్నాయి. 10 బేసిక్ పాయింట్లు మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్ (ఎంసీఎల్ఆర్) పెంచుతూ భారతీయ స్టేట్‌బ్యాంక్ (ఎస్బీఐ) తీసుకున్న నిర్ణయం శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చింది. గత నెలలోనే ఎస్బీఐ ఈ మేరకు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కనుక ఇప్పటికే ఎస్బీఐలో రుణాలు తీసుకున్న వారు, తీసుకోవాలని భావిస్తున్న వారిపై అదనపు భారం పడనున్నది. దీనివల్ల ఇండ్ల రుణాలు, వ్యక్తిగత రుణాలు, వాహన రుణాలపై ఈఎంఐ భారం పెరుగనున్నది.
రుణాల టెన్యూర్‌ను బట్టి ఎస్బీఐ ఎంసీఎల్ఆర్ పెంచివేసింది. ఒక నెల నుంచి మూడు నెలల్లోపు టెన్యూర్ గల రుణాలపై వడ్డీరేటు 7.05 నుంచి 7.15 శాతానికి, ఆరు నెలల గడువు గల రుణంపై వడ్డీరేటు 7.35 నుంచి 7.45 శాతానికి పెరిగాయి
ఏడాది కాల రుణానికి వడ్డీరేటు 7.40 నుంచి 7.50 శాతానికి పెరిగింది. రెండేండ్ల టెన్యూర్ రుణంపై వడ్డీరేటు 7.60 నుంచి 7.70 శాతానికి, మూడేండ్ల గడువు గల రుణంపై వడ్డీరేటు 7.70 నుంచి 7.80 శాతం పెరిగింది.