సంగారెడ్డి, అక్టోబర్ 23 : మదిలో ఆలోచన వస్తే వెంటనే అమలు చేసే వారు చాలా అరుదుగా ఉంటారు.. చిన్న ఆలోచనతో పెద్ద మోటర్ సైకిల్ తయారు చేయడమంటే ఆశామాషీ కాదు. అలాంటివి తయారు చేసేది ఇంజినీర్ల వల్లే సాధ్యం అనుకుంటాం. కానీ, అందుకు తీసిపోకుండా కరోనా నేపథ్యంలో లాక్డౌన్ సమయంలో వచ్చిన ఆలోచనతో రూ.35 వేల వ్యయంతో పాత వాహనాల పరికరాలతో పాటు 50సీసీ ఇంజిన్‌ను కొనుగోలు చేసి భళే ఆకారంతో బైక్‌ను తయారు చేసి అందరినీ అబ్బుర పరుస్తున్నాడు ఓ యువకుడు. జిల్లా కేంద్రం సంగారెడ్డి పట్టణం మగ్దుంనగర్కు చెందిన అబూ ఖాలేద్ కింగ్స్. మొబైల్ షాపు నడుపుతూ జీవనం సాగిస్తూ ఉపాధి పొందుతున్నాడు. కరోనా కాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ విధించడంతో ఇంటి దగ్గర ఖాళీగా ఉండటం కన్నా ఏదో చేయాలనే ఆలోచనతో చార్జింగ్, పెట్రోల్‌తో నడిచే బైక్ తయారీకి శ్రీకారం చుట్టాడు అబూ ఖాలేద్. నెల రోజుల్లో రెండు చిట్టి చక్రాలు.. భారీ ఆకారంతో కనిపించే మోటర్ సైకిల్ తయారు చేసి రహదారులపై రయ్య్ మంటూ.. చక్కర్లు కొడుతున్నాడు. మార్గ మధ్యలో చార్జింగ్ అయిపోయినా.. పెట్రోల్‌తో నడిచే విధంగా బైక్‌కు ఇంజిన్‌ను అమర్చాడు. నూతన వాహనాలు మార్కెట్లో కనిపిస్తే ఆసక్తిగా తిలకించే ప్రజలు చిన్న చక్రాలు, భళే ఆకారంతో తిరుగుతున్న బైక్ వెంట పరుగులు తీస్తూ తిలకిస్తున్నారు.
కరోనా నేర్పిన ఇంజినీరింగ్..
లాక్డౌన్ సమయంలో ఇంటి దగ్గర ఖాళీగా ఉండటం ఇష్టంలేక ఏదో ఒకటి చేయాలని తక్కువ వ్యయంతో బైక్‌ను తయారు చేశాడు. మెదడులో వచ్చిన ఆలోచనను అమలు చేస్తే ఇలాంటి నూతన ఆవిష్కరణలు ప్రజలకు అందించవచ్చని, అందుకు ప్రభుత్వం సహకారం అందించాలని కోరుతున్నాడు అబూ ఖాలేద్. పదేండ్లుగా మొబైల్ దుకాణం నడుపుతూ వచ్చిన అనుభవం బైక్ తయారీకి చాలా ఉపయోగపడింది. ఈ బైక్‌ను రైతులు తమ పంట పొలాల్లో చీడపీడలను నాశనం చేసేందుకు పిచకారీ చేసి పంపుతో పాటు ఇద్దరు వ్యక్తులను సునాయసంగా ప్రయాణించే విధంగా తయారు చేశాడు. మూడు గంటల చార్జింగ్‌తో ఈ బైక్‌పై 40 కిలో మీటర్ల వరకు ప్రయాణించవచ్చు. ఒకవేళ మార్గ మధ్యలో చార్జింగ్ అయిపోతే సమీపంలో ఉన్న పెట్రోల్ బంకు నుంచి పెట్రోల్ పోయిస్తే నడిచే విధంగా ఇంజిన్‌ను అమర్చాడు.
సహరిస్తే తయారీకి సిద్ధం..
సాంకేతిక కారణాలతో రోజురోజుకూ పెరుగుతున్న కాలుష్యం నుంచి మనల్ని మనం రక్షించుకోడానికి కాలుష్య రహిత వాహనాలు ఉపయోగిండం చాలా మంచిది. పర్యావరణ రక్షణకు ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, వ్యాపార వాణిజ్యరంగ నిపుణులు సహకరిస్తే తక్కువ వ్యయంతో ఇలాంటి బైక్‌లను ప్రజల ముందుకు తీసుకొచ్చేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. ప్రభుత్వం సహకరిస్తే భవిష్యత్‌లో మరిన్ని మోటర్ సైకిళ్లను తయారు చేస్తాను.