సాయంత్రం వేడివేడి సమోసా తింటూ స్నేహితులతో సరదాగా కబుర్లు చెప్పుకోవడం మంచి అనుభూతి. అంతేకాదు, ఒక్క సమోసా తినేసి ఏకంగా 11 వేల రూపాయలు సంపాదించేయవచ్చు. నిజమే, ఢిల్లీలోని ఘజియాబాద్‌కు చెందిన సాయిబాబా అనే ఓ వీధివ్యాపారి వినూత్న ఆలోచనే ఇది. సోషల్ మీడియాలో ఫుడ్ చాలెంజ్‌ల స్ఫూర్తితో తనూ ఓ సవాలు విసిరాడు. ఆలూ, పనీర్ దట్టించి తాను చేసే మూడు కిలోల సమోసాను తింటే కనుక.. అక్షరాలా పదకొండు వేలు మీ సొంతం. కానీ, అయిదు నిమిషాల్లో ఆరగించాలని షరతు. లేదంటే, కేజీ సమోసా ఒక నిమిషంలో తిన్నా 11 వేలు గెలుచుకోవచ్చు. కేజీ సమోసా ధర రూ.199. మూడు కేజీల సమోసా అయితే రూ. 500. సమోసాతోపాటు ఒక కూల్‌డ్రింక్ ఇస్తారు. ఇప్పటికే చాలామంది ప్రయత్నించి చేతులెత్తేశారట. మీరూ ప్రయత్నిస్తారా.. సమోసా!
టీ అనారోగ్యకరమని తిట్టుకునేవారు ఎంతమందో, అమృతతుల్యమని వాదించేవారూ అంతమందే. ఏమైనా చెప్పండి, రోజూ రెండు కప్పులైనా టీ తాగనిదే మాకు రోజు గడవదంటారు తేనీటి ప్రియులు. అలసట, ఒత్తిడి, చికాకు.. కారణం ఏదైతేనేం మనసు కప్పు వేడివేడి చాయ్ మీదికి మళ్లుతుంది. అయితే, టీ ఎక్కువగా తాగడం వల్ల ఆకలి మందగిస్తుందనీ, నిద్రలేమి వంటి సమస్యలు వస్తాయనీ వాదనలు వినిపిస్తాయి. కానీ చైనా విశ్వవిద్యాలయ అధ్యయనం ప్రకారం మాత్రం.. నిర్ణీత మోతాదులో టీ తాగడం వల్ల నష్టమేమీ ఉండదు. పైపెచ్చు తేయాకులోని పోషకాలు రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయని, క్యాన్సర్ కారకాలను నిరోధిస్తాయని పరిశోధకులు తేల్చారు. చక్కెర లేకుండా రోజూ రెండు నుంచి నాలుగు కప్పుల టీ తాగడం వల్ల శరీరానికి తగిన మోతాదులో ఫ్లేవనాయిడ్స్ అందుతాయని అంటున్నారు.
కొత్తకొత్తగా ఉన్నదీ… కొరియా ఊరిస్తూ ఉన్నదీ… అని పాడుకుంటున్నారు ఇండియన్ యూత్. ఇప్పటిదాకా కొరియన్ డ్రామాలనూ, పాప్ సాంగ్స్నూ తెగ ఆదరిస్తున్న మనవాళ్లు కొరియా రుచుల్నీ ఓ రేంజ్లో ఇష్టపడుతున్నారు. గత ఏడాది ఒక్క కొరియన్ నూడుల్స్ అమ్మకాలే 180 రెట్లు పెరిగాయని అంచనా. చిత్రవిచిత్రమైన పేర్ల కొరియన్ వంటలూ, వాటిని అమ్మే రెస్టారెంట్లూ బాగా విస్తరిస్తున్నాయి. హైదరాబాద్, ఢిల్లీ, పుణె, ముంబై, బెంగళూరు, గుర్గావ్, చెన్నై తదితర నగరాల్లో కొరియన్ రెస్టారెంట్లు మెరుస్తున్నాయి. ప్యాకేజ్డ్ ఫుడ్‌ను అమ్మే కొరియన్ కంపెనీ ఒరియన్ తన తయారీ కేంద్రాన్ని గుజరాత్లో ఏర్పాటు చేయనున్నది. బియ్యం, పాలకూర, క్యారెట్, బీన్స్, మిరియాలు, నువ్వుల నూనెలను కలిపి చేసే బింబింబాప్… క్యాబేజీ, ముల్లంగి, కీరాలతో మన పచ్చడి తరహాలో చేసే కిమ్చీ… అన్నం, సముద్రనాచు కలిపి చేసే కింబాప్ లాంటివాటినీ మనవాళ్లు అధికంగా ఇష్టపడుతున్నారు. నిజానికి కొరియన్ వంటల్లో కూడా భారతీయ వంటల్లో వాడే బియ్యం, కూరగాయలు, మిరపకాయలు, మిరియాలు, మాంసంలాంటివే చాలా వరకూ ఉంటాయి. వాటి రుచి కూడా మన వంటకాలను పోలి ఉంటుంది. వేడివేడిగా, కారంకారంగా ఉంటాయి కూడా. వీలు కుదిరితే మీరూ ఈ కొత్త వంటకాల్ని రుచి చూడండి.కెవ్వు కొరియా.. అని అరిచేయండి.
‘బాహుబలి’తో పాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్రభాస్ భేషైన భోజనప్రియుడు. ఆతిథ్యంలో అందెవేసిన చేయి. కమ్మకమ్మని వంటలు వండిస్తాడు. కొసరికొసరి వడ్డిస్తాడు. బెస్ట్ కాంబినేషన్లు ఏమిటన్నదీ చెబుతాడు. అసలు ఎలా వండారన్నది కథలు కథలుగా వర్ణిస్తాడు. ప్రభాస్ ఏ సినిమా షూటింగ్లో ఉంటే ఆ ప్రాజెక్ట్‌లో పనిచేసేవారికంతా తన ఇంటినుంచే భోజనం. అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, పూజా హెగ్డే, భానుశ్రీ.. ఇలా ప్రభాస్ విందు ఆరగించినవారి జాబితా చాలా పెద్దదే. ఇప్పుడు ఈ జాబితాలో దిశా పఠానీ కూడా చేరింది. ప్రభాస్ నటిస్తున్న ‘ప్రాజెక్ట్ కె’లో దిశ కథానాయిక. షూటింగ్ తొలిరోజు దిశకు వెల్కమ్ చెబుతూ ప్రభాస్ విందు పంపాడట. ఈ విషయాన్ని దిశ స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటించింది. హాట్ క్యారియర్లు ఉన్న ఫొటోలు పెట్టి ‘థ్యాంక్ యూ ప్రభాస్ సర్.. ఇలా నోరూరించే వంటలు పంపి మమ్మల్ని చెడగొడుతున్నారు’ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది.
పైన.. ఆకాశంలో మిరుమిట్లు గొలిపే నక్షత్రాలు. కింద.. నేలపై ధగధగా వెలిగే విద్యుత్ దీపాలు. ఆ వాతావరణంలో కమ్మటి ఆహారం కడుపులోకి దిగుతుంటే ఎలా ఉంటుంది? నోటికి రుచిగానూ, మనసుకు ఆహ్లాదకరంగానూ అనిపిస్తుంది కదూ! ఈ అనుభూతిని పొందాలంటే ఏ ఆస్ట్రేలియాకో ఎగిరిపోవాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ మాదాపూర్‌లో ఉన్న ‘క్లౌడ్ డైనింగ్’ రెస్టారెంట్‌కు వెళితే చాలు. ఇక్కడ గాల్లో విహరిస్తూ భోజనం చేసేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దాదాపు 160 అడుగుల ఎత్తుమీద కూర్చుని యాభై రకాల వంటకాలను రుచి చూడవచ్చు. ఒకేసారి 26 మంది ఆరగించడానికి వీలుగా డైనింగ్ టేబుల్ ఏర్పాటుచేశారు. అయితే, ఒకరికి ఐదువేల రూపాయల వరకూ చార్జ్ చేస్తారు.
వీకెండ్స్‌లో రద్దీ ఎక్కువే.
♦ సోంపు, జీలకర్ర, ధనియాలు రాత్రంతా నానబెట్టి, ఆ నీళ్లు మరుసటి రోజు తాగడంవల్ల ఒంట్లో వేడి తగ్గుతుంది.
♦ దానిమ్మ గింజల్లో వేడిని తగ్గించే లక్షణం ఉంది. రెండుమూడు రోజులకు ఒకసారి దానిమ్మ రసం తాగితే శరీరం చల్లగా ఉంటుంది.
♦ ఒక టీ స్పూన్ కరక్కాయ పొడికి, అర టీ స్పూన్ చక్కెర కలిపి పరగడుపున తింటే ఒంట్లో వేడి తగ్గిపోతుంది.
Fanta Noodles | నీళ్లతో కాకుండా ఫాంటాతో చేసే నూడిల్స్ ఎప్పుడైనా టేస్ట్ చేశారా !!”
T-Kitchen | గులాబ్ జామూన్‌తో బజ్జీలు కూడా చేస్తారని మీకు తెలుసా?”
ఇది మర్యాద రామన్న హోటల్.. ఇక్కడ ఎంత రెస్పెక్ట్ ఇస్తే అంత డిస్కౌంట్ !!”
అమ్మో ! ఒక్క సమోసా 900 రూపాయలా? ఎక్కడో తెలుసా!!”
Matka Pizza | కుండ పిజ్జా ఎప్పుడైనా రుచి చూశారా?”