అగ్ర కథానాయిక సమంత ‘పుష్ప’ సినిమా కోసం తొలిసారి ఐటెంసాంగ్‌లో నర్తించింది. ఈ గీతానికి దేవిశ్రీప్రసాద్ హుషారైన మాస్ బీట్ అందించారు. ‘కోకా కడితే కొరకొరమంటూ చూస్తారు..పొట్టి గౌనే వేస్తే పట్టిపట్టి చూస్తారు..కోకా కాదు..కట్టూ కాదు..గౌనులోన ఏముంది? మీ కళ్లలోనే అంతా ఉంది. మీ మగబుద్ధే వంకరబుద్ధి..ఊ అంటావా మావ..ఊఊ అంటావా మావ.. అంటూ సాగిన ఈ పాట లిరికల్ వీడియోను శనివారం విడుదల చేశారు. ఇంద్రావతి చౌహాన్ ఆలపించిన ఈ గీతాన్ని చంద్రబోస్ రచించారు. సమంత అందచందాలు, నృత్యం కలబోతగా ఈ పాట ఉర్రూతలూగిస్తున్నదని చిత్రబృందం తెలిపింది. అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప’ ఈ నెల 17న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఫహాద్ ఫాజిల్, ధనుంజయ్, సునీల్, రావురమేష్, అజయ్‌ఘోష్, అనసూయ భరద్వాజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: మిరోస్లా క్యూబా బ్రోజెక్, సంగీతం:దేవిశ్రీప్రసాద్, ఆర్ట్: రామకృష్ణ-మోనిక, సీఈఓ: చెర్రీ, నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, నిర్మాణ సంస్థలు: మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా, దర్శకత్వం: సుకుమార్.