హైదరాబాద్, మే23 (నమస్తే తెలంగాణ): పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి భూసేకరణ, నిర్వాసితులకు చెల్లింపుల కోసం రూ.587 కోట్లకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ప్రాజెక్టులో భాగంగా రిజర్వాయర్లు, ప్రధాన కాలువలు తవ్వడంతో అందుకు సంబంధించి 5,337మంది భూనిర్వాసితులు ఉన్నారు. భూసేకరణ, పునరావాస చర్యలకు సంబంధించి మొత్తం 819.98 కోట్లు చెల్లించాల్సి ఉన్నది.
అందులో ఇప్పటికే కొంత మొత్తం చెల్లించగా, ఇంకా 587.27 కోట్లు చెల్లించాల్సి ఉన్నది. అలాగే మరో 196 ఎకరాల భూ సేకరణకు అదనంగా రూ.50 కోట్లు చెల్లించాల్సి ఉన్నది. ఆ నిధుల చెల్లింపుకోసం ఇరిగేషన్‌శాఖ అధికారులు సమర్పించిన ప్రతిపాదనలకు రాష్ట్ర క్యాబినెట్ శనివారం ఆమోదం తెలిపింది. దీంతోపాటు నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని సిద్ధాపూర్ రిజర్వాయర్ విస్తరణ పనులకు సంబంధించిన బడ్జెట్‌ను రూ.17కోట్ల నుంచి రూ.55.30 కోట్లకు సవరిస్తూ చేసిన అంచనాలకు కూడా క్యాబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.