భువనేశ్వర్, డిసెంబర్ 2: తన సోదరికి ఓ సోదరుడు పంపిన మనియార్డరు నాలుగేండ్ల తర్వాత చేరింది. ఒడిశాలో జరిగిన ఈ సంఘటన పోస్టల్ శాఖ నిర్లక్ష్యానికి అద్దంపట్టింది. సుందర్‌గఢ్ జిల్లాలో కోయిడా బ్లాక్‌లోగల టెన్సా ఏరియాలో ఉండే సుమిత్రా బిస్వాల్‌కు రూర్కెలాలోని సెక్టార్ 8లో నివసించే తన అన్న 2018లో రూ.500 మనియార్డర్ చేశాడు. సావిత్రి వ్రతం కోసం ఈ మొత్తాన్ని పంపగా సుమిత్రాకు చేరలేదు. ఈ విషయాన్ని సుమిత్రా అన్న మరిచిపోయాడు. ఈ ఏడాది నవంబర్ 2022న సుమిత్రాకు రూ.500 మనియార్డర్ వచ్చింది. ఈ విషయాన్ని ఆమె తన అన్నకు తెలియజేయగా, తాను 2018లో పంపానని చెప్పాడు. దీంతో సుమిత్రా స్థానిక సబ్ పోస్ట్‌మాస్టర్‌ను ప్రశ్నించింది. తాను కొత్తగా వచ్చానని, ఈ మనియార్డర్ పెండింగ్‌లో ఉండడం కనిపించి క్లియర్ చేసినట్టు చెప్పాడు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్టు సమాధానమిచ్చాడు.