హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): వడ్ల కొనుగోళ్ల వ్యవహారంలో బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయని, ఆ రెండు పార్టీల రాష్ట్ర అధ్యక్షులు పోటీపడి రైతులను అయోమయానికి గురిచేస్తున్నారని పీయూసీ చైర్మన్ ఆశన్నగారి జీవన్‌రెడ్డి అన్నారు. శనివారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీ అపవిత్ర కలయిక హుజూరాబాద్ నుంచి మొదలై వడ్ల కొనుగోళ్ల దాకా కొనసాగుతున్నదని దుయ్యబట్టారు. వడ్ల కొనుగోళ్ల విషయంలో బండి సంజయ్‌కు కేంద్రాన్ని ఒప్పించే ధైర్యముంటేనే మాట్లాడాలని, లేదంటే నోర్మూసుకోవాలని హెచ్చరించారు. దేశ రైతాంగ ఉద్యమానికి తానే నాయకత్వం వహిస్తానని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో మోదీ దిగొచ్చారని పేర్కొన్నారు. మెడలు వంచుతామన్న బీజేపీ నేతలు ఇప్పుడు ఎవరి మెడలు వంగాయో చెప్పాలని ప్రశ్నించారు. తప్పు ఒప్పుకొని జాతికి క్షమాపణ చెప్పిన ప్రధాని మోదీని ఆదర్శంగా తీసుకొని బండి సంజయ్ బుద్ధి తెచ్చుకోవాలని హితవు పలికారు. తాము అద్భుతమైన వ్యవసాయ చట్టాలు తెస్తే కొందరు మూర్ఖులు అడ్డుపడుతున్నారని, మాపై దాడులు చేస్తే.. తరువాతి దాడి ప్రగతిభవన్ పైనేనని ప్రగల్భాలు పలికిన బండి సంజయ్ ఇప్పుడేమి సమాధానం చెప్తారని నిలదీశారు.
తాలిబన్ల భాష మాట్లాడుతున్న రేవంత్
రేవంత్‌కు ఎడ్లు లేవు.. వడ్లులేవు.. బండి సంజయ్‌కు బండి లేదని జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర రైతులపై నిజమైన ప్రేమ ఉంటే సోనియా, రాహుల్‌గాంధీతో కేంద్రానికి లేఖ రాయించాలని డిమాండ్ చేశారు. రేవంత్‌రెడ్డి తాలిబాన్ల భాష మాట్లాడుతున్నాడని, సీఎం కేసీఆర్ గురించి అడ్డగోలుగా మాట్లాడితే ఆయనను రైతులే చీరేస్తారని హెచ్చరించారు. విదేశాల్లో మాదిరి కఠిన చట్టాలే ఉంటే రేవంత్‌కు ఎప్పుడో శిక్షపడేదని పేర్కొన్నారు.
కాంగ్రెస్ చతికిల పడటంతోనే..
ప్రధాని మోదీకి ప్రత్యామ్నాయం సీఎం కేసీఆరేనని ఎమ్మెల్యే ఆనంద్ పేర్కొన్నారు. దేశంలో కాంగ్రెస్ చతికిల పడటం, ప్రత్యామ్నాయం లేనందువల్లే బీజేపీ చక్రం తిప్పుతున్నదని చెప్పారు. బీజేపీని కూలగొట్టే శక్తి సీఎం కేసీఆర్‌కు ఉన్నదని భయపడే మోదీ వ్యవసాయ చట్టాలను రద్దుచేశారని అన్నారు. మతం పేరుతో పబ్బం గడిపే బీజేపీకి దేశ ప్రయోజనాల కన్నా రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని విమర్శించారు. సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ (ఎల్పీజీ) ముసుగులో లాభాల్లో నడిచే ప్రభుత్వరంగ సంస్థలను అప్పనంగా అమ్మడమే ఆ పార్టీ విధానమని దుయ్యబట్టారు. బీజేపీ అంటే అమ్మకమని, టీఆర్ఎస్ అంటే నమ్మకమని చెప్పారు.