హైదరాబాద్: రియల్ లైఫ్ బాహుబలి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఒక వ్యక్తి మూడు నెలల పసివాడ్ని తలపై ఉంచిన తట్టలో వరద ముంపు ప్రాంతం నుంచి సురక్షితంగా తరలించాడు. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో గురువారం ఈ సంఘటన జరిగింది. రాష్ట్రంలో గత ఆరు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాలు నీట మునిగాయి. గోదావరి, మానేరు బ్యాక్‌వాటర్‌తో వరద నీరు ఉప్పొంగి ప్రవహిస్తున్నది. దీంతో పెద్దపల్లి జిల్లాలోని మంథని జల దిగ్బంధమైంది. నగరం ప్రధాన చౌరస్తాలోకి పెద్దఎత్తున వదర నీరు చేరింది. పట్టణంలోని అంబేద్కర్ నగర్, మర్రివాడ, వాసవీనగర్, దొంతలవాడ, బోయిన్ పేట, బర్రెకుంటలోని ఇండ్లు నీట మునిగాయి.
మరోవైపు మంథనిలోని వరద ముంపు ప్రాంతాల నుంచి బాధితులను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇందులో భాగంగా మూడు నెలల పసి బాలుడితో చిక్కుకున్న ఒక కుటుంబాన్ని రెస్క్యూ సిబ్బంది కాపాడారు. ఒక వ్యక్తి తలపై పెట్టుకున్న ప్లాస్టిక్ తట్టలో ఆ పసి బాలుడ్ని మోశాడు. భుజాల వరకు మునిగి ఉన్న ఆ ప్రాంతం నుంచి సురక్షితంగా తీసుకెళ్ళాడు. పసి బాబు అమ్మను కూడా మరో వ్యక్తి సురక్షితంగా వరద ముంపు ఇంటి నుంచి తరలించారు.
కాగా, స్థానికులు తమ మొబైల్ ఫోన్లో రికార్డు చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బాహుబలి సినిమాను గుర్తుకు తెచ్చేలా ఉన్న ఈ వీడియోలోని పసి బాలుడ్ని రియల్ లైఫ్ బాహుబలిగా నెటిజన్లు పేర్కొన్నారు.
భారీ వర్షాలకు పెద్దపల్లి జిల్లాలో ఓ వ్యక్తి చిన్నారిని బహుబలి సినిమాలో లాగా బుట్టలో పెట్టుకొని నీళ్లలో ఈదుకుంటూ ఒడ్డుకు చేర్చడం వైరల్‌గా మారింది. pic.twitter.com/EfayVKOGXs
— Namasthe Telangana (@ntdailyonline) July 14, 2022