మాడ్రిడ్: ఓ ఎలుక ఏకంగా పార్లమెంట్‌లోనే హల్చల్ చేసింది. ఎంపీలను ఉరుకులు పరుగులు పెట్టించింది. దీనికి సంబంధించి ప్రముఖ వార్తా సంస్థ రాయ్‌టర్స్ ట్వీట్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ ఘటన బుధవారం స్పెయిన్‌లోని సెవిల్‌లో ఉన్న ఆండలూసియా పార్లమెంట్లో జరిగింది. సభ్యులు ముఖ్యమైన అంశంపై ఓటింగ్‌కు సిద్ధమవుతుండగా.. ఓ ఎలుక కనిపించింది.
ఆ సమయంలో సీరియస్‌గా మాట్లాడుతున్న స్పీకర్ మార్తా బోస్కెట్ ఆ ఎలుకను చూసి షాక్ తిన్నారు.. అది చూసి మిగతా సభ్యులు కూడా దాని కోసం అటు ఇటూ చూశారు. కొందరు తమ సీట్లలో నుంచి లేచి పరుగెత్తగా.. మరికొందరు కాళ్లుపైకి పెట్టుకోవడానికి ప్రయత్నించారు. కాసేపటికి ఎలాగోలా ఆ ఎలుకను బయటకు పంపించి.. మళ్లీ సభను నడిపించారు.