e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, October 26, 2021
Home News Rajanna Siricilla: ప్రత్యామ్నాయ పంటల సాగులో రాజన్న సిరిసిల్లను ఆదర్శంగా నిలపాలి : మంత్రి కేటీఆర్‌

Rajanna Siricilla: ప్రత్యామ్నాయ పంటల సాగులో రాజన్న సిరిసిల్లను ఆదర్శంగా నిలపాలి : మంత్రి కేటీఆర్‌

రాజన్న సిరిసిల్ల : సాంకేతిక పరిజ్ఞానాన్ని అంది పుచ్చుకుని కొత్త, కొత్త ఆలోచనలను ఆవిష్కరించాలి. ప్రత్యామ్నాయ పంటల సాగులో జిల్లాను ఆదర్శంగా నిలుపుతూ నవశకానికి నాంది పలకాలని మున్సిపల్‌, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు. దొడ్డు బియ్యం కొనుగోలు చేయమని కేంద్రం స్పష్టం చేసిన నేపథ్యంలో సన్నబియ్యం పండించడంతోపాటు వాణిజ్య పంటల సాగుపై రైతులు దృష్టి సారించేలా అధికారులు అవగాహన కల్పించాలని సూచించారు. ఆయిల్‌పామ్‌ సాగుతో అధిక లాభాలున్నాయన్న విషయాన్ని గుర్తించాలని, మోహినికుంటలో తానే స్వయంగా 15 ఎకరాల్లో సాగు చేస్తానని మంత్రి ఈసందర్భంగా ప్రకటించారు. సోమవారం జిల్లాలో ఆయన ఆకస్మిక పర్యటన చేశారు. హైదరాబాద్‌ నుంచి మధ్యాహ్నం 2 గంటలకు సిరిసిల్లకు చేరుకుని సమీకృత కలెక్టరేట్‌లో వ్యవసాయ శాఖ నిర్వహించిన యాసంగి పంటల మార్పిడి అవగాహన కార్యక్రమానికి హాజరయ్యారు.

వచ్చే యాసంగి నాటికి తీసుకోవాల్సిన ప్రత్యామ్నాయ పంటల సాగుపై వ్యవసాయ విస్తరణ అధికారులు, రైతుబంధు సమన్వయ సమితి ప్రతినిధులు, ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. నాటి కరువు నేలలో ఎగువమానేరు, అన్నపూర్ణ, శ్రీరాజరాజేశ్వర జలాశయాల ద్వారా జిల్లాలో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయని తెలిపారు. మల్కపేట రిజర్వాయర్‌ పూర్తయితే భూగర్భ జలాల సామర్థ్యం మరింత పెరిగే అవకాశం ఉందని, జిల్లాలోని 666 చెరువులు 85శాతం నిండుకుండలా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. వేరుశనగ, కందులు, పొద్దుతిరుగుడు, ఇతర కూరగాయల సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలని అందుకు రైతుబంధు సభ్యులు, ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని సూచించారు.

- Advertisement -


ఆయిల్‌పామ్‌ తోటల సాగు చేపట్టాలి …
ఆయిల్‌పామ్‌ తోటల సాగుతో రైతులు అధిక లాభాలు ఆర్జించొచ్చని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. జిల్లాలోని 57 క్లస్టర్ల పరిధిలో సగటున వంద ఎకరాల్లో సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలని అందుకు వ్యవసాయ విస్తరణ అధికారులు, రైతు వేదికల్లో ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేసి అవగాహన సమావేశాలు నిర్వహించాలని సూచించారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత జిల్లా నుంచి రైతులను ఖమ్మం జిల్లా అశ్వారావుపేటలోని ఆయిల్‌పామ్‌ తోటల అవగాహన కోసం స్టడీ టూర్‌ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. రైతులతోపాటు తాను వస్తానని చెప్పారు. ప్రజాప్రతినిధులు బాధ్యత తీసుకుని వారి వ్యవసాయ క్షేత్రాల్లో ఆయిల్‌పామ్‌ తోటల సాగు చేయాలని మంత్రి కోరారు. మోహినికుంట గ్రామంలో 15 ఎకరాల స్థలం తీసుకుని స్వయంగా తానే ఆయిల్‌ పామ్‌ సాగు చేస్తానని మంత్రి సమావేశంలో ప్రకటించారు. నెలాఖరులోగా 57 క్లస్టర్లలో 57 సమావేశాలు ప్రత్యామ్నాయ పంటలపై జరగాలని ఆదేశించారు.

ఎల్లారెడ్డిపేట మండలంలో ఉన్నట్లుగానే కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్లు రైతులకు అందుబాటులో ఉండేలా మరో నాలుగైదు ఏర్పాటు చేయాలని సూచించారు. ఏ గుంటలో ఏ రకం పంట పండుతుంతో విస్తరణ అధికారులకు పక్కా సమాచారం ఉండాలన్నారు. గతేడాది కంటే ఈ ఏటా అదనంగా లక్ష ఎకరాలలో ధాన్యం పండినట్లు తెలిపారు. డ్రోన్‌ల ద్వారా ఎరువులు, విత్తనాలు చల్లుతున్నారని ఇలాంటి వాటితో సాగుకు సాంకేతిక దన్నుగా నిలిచేలా చర్యలు తీసుకోవాలన్నారు.


రుణమాఫీలో రాష్ట్రం నంబర్‌వన్‌..
రైతులకు అండగా ఉండి, ఎవరికి రాని ఆలోచనలతో సీఎం కేసీఆర్‌ చేపట్టిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని కొనియాడారు. రైతుబంధు, రైతుబీమా, ఉచిత కరెంటు, రుణమా ఫీలాంటి పథకాలతో అన్నదాతలకు అండగా నిలుస్తున్న రాష్ట్రం తెలంగాణనే నని ఆయన గుర్తు చేశారు. రైతు రుణమాఫీలో రాష్ట్రం నంబర్‌వన్‌గా నిలిచిందని, ఊరూరా ధాన్యం నిలువ కేంద్రాలు నిర్మించిన ఘనత సర్కారుకే దక్కిందన్నారు. ముఖ్యమంత్రి దూరదృష్టితో నీలి, హరిత, గులాబీ, శ్వేత విప్లవాలను ఆవిష్కృతం చేశారన్నారు.


బ్లాక్‌ రైస్‌ పండించిన యువ రైతు
చక్కెర వ్యాధి నిలువలు తక్కువగా ఉండే బ్లాక్‌ రైస్‌ను పండించిన యువ రైతును మంత్రి కేటీఆర్‌ అభినందించారు. కోనరావుపేట మండలం కొండాపూర్‌కు చెందిన యువ రైతు టపెల్లి చంద్రశేఖర్‌ తాను పండించిన బ్లాక్‌ రైసును మంత్రి కేటీఆర్‌కు చూపించారు. బ్లాక్‌ రైస్‌ చక్కెర వ్యాధి ఉన్న వారు తిన్నా ఆరోగ్యంగా ఉంటారని చెప్పడంతో ఇలాంటి బియ్యంతోపాటు తెలంగాణ సోనా లాంటివి పండించాలని సూచించారు. కొత్త రకం బియ్యం పండించిన యువ రైతును అందరూ ఆదర్శంగా తీసుకుని కొత్తరకం పంటలను సాగు చేయాలని సూచించారు.


క్యూఆర్‌ బార్‌ కోడ్‌ ఆవిష్కరణ …
సిరిసిల్ల పట్టణ ప్రజల సమస్యల పరిష్కరానికి మున్సిపల్‌ శాఖ ప్రత్యేకంగా రూపొందించిన క్యూఆర్‌కోడ్‌ పోస్టర్‌ను మంత్రి ఆవిష్కరించారు. ఆన్‌లైన్‌ ద్వారా నేరుగా ఫిర్యాదు చేసేందుకు మున్సిపల్‌ శాఖ రూపొందించిన క్యూఆర్‌బార్‌కోడ్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపు నిచ్చారు. బస్టాండ్‌లు, పబ్లిక్‌ స్థలాలు, టాయిలెట్లు, మార్కెట్లలో క్యూఆర్‌ బార్‌కోడ్‌ పోస్టర్లను ఏర్పాటు చేస్తారని, సెల్‌ఫోన్‌లో కోడ్‌ కొట్టి సమస్యను ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి, నాబ్‌స్కాబ్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు, జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు గడ్డం నర్సయ్య, వ్యవసాయాధికారి రణధీర్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళ, వ్యవసాయ శాఖ అధికారులు, రైతుబంధు సమన్వయ సమితి మండల, గ్రామ శాఖల ప్రతినిధులు, జడ్పీటీసీలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement