e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 13, 2021
Home News వంటింట్లోకి మట్టి పాత్ర

వంటింట్లోకి మట్టి పాత్ర

వంటింట్లోకి మట్టి పాత్ర

మట్టి గిన్నెలకు మళ్లీ జీవం
ఆధునికతతో కొత్త రూపు
మార్కెటో ఎన్నో రకాల వెరైటీలు
ఇష్టపడుతున్న నేటితరం

వేములవాడ/హుజూరాబాద్‌, మార్చి 27: ఒకప్పుడు మన జీవితాలతో మమేకమై, మధ్యలో కనుమరుగైన మట్టి పాత్ర మళ్లీ వంటింట్లోకి చేరుతున్నది. మన తాతముత్తాతల జీవితంలో ఇమిడిపోయి ఆరోగ్యాన్ని పంచిన ‘మిట్టి బౌల్‌’ మరలా జీవం పోసుకుంటున్నది. పాశ్చాత్య ధోరణితో కుక్కర్లు, నాన్‌ స్టిక్‌ ప్యాన్లు, స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ గిన్నెలకు అలవాటు పడిపోయి రోగాల పుట్టగా మారిన జీవితం, అలనాటి ఆరోగ్య అక్షయ మట్టి పాత్ర వైపు మళ్లుతున్నది. సహజ సిద్ధ పద్ధతులతో మేలు చేసే అప్పటి సంప్రదాయానికి ఇప్పుడిప్పుడే ప్రాధాన్యం పెరుగుతుండగా, మార్కెట్టూ ఇటే తిరుగుతున్నది. నేటితరం అభిరుచికి తగ్గట్టు వివిధ రకాల పాత్రలతో ఎక్కడికక్కడ దుకాణాలు వెలుస్తున్న నేపథ్యంలో, ‘నమస్తే’ అందిస్తున్న ప్రత్యేక కథనం.
ఒకప్పుడు ఇంట్లోని వంట పాత్రలు మొదలు ధాన్యం నిల్వలు, ఇతర అనేక అవసరాలకు మట్టిపాత్రలనే వినియోగించేవారు. పూర్వకాలం మనవాళ్లు కుండలో అన్నం, కంచుడులో కూర.. పెరుగు కోసం గురిగి, రొట్టె కాల్చేందుకు కొద్దిల మందం పెంక, మక్క, పజ్జొన్న, పెసర్లు, బబ్బెర్లు ఏంచేందుకు మంగుళం .. ఇలా ఎన్నో రకాల పాత్రలు ఉపయోగించేవారు. కుండలో ఉడకబెట్టిన మక్కగుడాల రుచి వేరుగా ఉండేదని నాటి తరం మనుషులు గుర్తు చేసుకుంటారు. మట్టిలో అనేక రకాలు పోషకాలు, ఖనిజాలు ఉంటాయని, మట్టి పాత్రలో తయారు చేసిన ఆహార పదార్థాలతో మన ఆరోగ్యానికి కావాల్సిన 18 రకాల మైక్రో న్యూట్రీన్లు లభిస్తాయని వైద్యులు చెబుతున్నారు. అల్యూమినియం, స్టీల్‌ పాత్రలలో వండిన వంటకాలలో మైక్రో న్యూట్రీన్లు చాలా వరకు తక్కువగా ఉంటే, మట్టిపాత్రలో మాత్రం వందశాతం ఉంటాయంటున్నారు. అలాగే, మట్టి పాత్రకు వేడి తగులగానే మట్టిలో కంటికి కనబడని కిరణాలు వెలువడి పదార్థాలన్నీ శుద్ధిగా మారేవని, అందుకే మన పూర్వీకులు ఆరోగ్యపరంగా దిట్టంగా ఉండేవారని చెబుతున్నారు.
మళ్లీ డిమాండ్
ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌ అనే సామెతకు అతికినట్లు మరలా ఆరోగ్య రీత్యా మన తాతలు, ముత్తాతలు వాడినటువంటి మట్టి పాత్రలే ఇప్పుడిప్పుడే ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. అన్నం వండుకోవడం నుండి మొదలు పెడితే కూర, ఇడ్లీ, రొట్టె, చివరికి చాయ్‌ తాగే కప్పులతో సహా చాలా రకాల మట్టి పాత్రలు ఇప్పుడు మార్కెట్‌లో దర్శనమిస్తున్నాయి. అయితే, ఇవి అప్పటి పాత్రలకు కొద్దిగా ఆధునికం జోడించి తయారు చేస్తున్నారు. నాడు సారెను ఉపయోగిస్తే, నేడు యంత్రాలపై తయారు చేస్తున్నారు. మార్కెట్‌కు.. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా అధునాత పద్ధతుల్లో రూపొందిస్తున్నారు. నేరుగా మార్కెట్లు, వారసంతల్లో విక్రయిస్తున్నారు. ఇటు ఇతర రాష్ర్టాల వాసులు రాష్ట్ర, జాతీయ రహదారులకు ఇరువైపులా స్టాళ్లు ఏర్పాటు చేసి మరీ అమ్ముతున్నారు. రాజస్థాన్‌ నుంచి వచ్చిన సుమారు 30కి పైగా కుటుంబాలు కరీంనగర్‌ కోర్టు చౌరస్తా నుంచి జగిత్యాలకు వెళ్లే ప్రధాని రహదారి వెంట కొద్దిరోజులుగా వీటిని విక్రయిస్తున్నాయి. టీ కప్పు నుంచి మొదలుకొని వంటకు ఉపయోగపడే అన్ని రకాలు దొరుకుతున్నాయి. ఇందులో 150 నుంచి మొదలుకొని 500 వరకు పలికే వస్తువులు ఉన్నాయి.
కుండ నీళ్లు చల్లగా..
ఇప్పుడు మనం తాగే నీళ్లు ప్లాంట్లలో నుంచి ప్లాస్టిక్‌ క్యాన్లలో తెచ్చుకుంటున్నాం. లేదంటే ప్లాస్టిక్‌తో తయారు చేసిన ప్యూరిఫైడ్‌ మిషన్ల ద్వారా శుద్ధి చేసుకొని తాగుతున్నాం. చల్లదనం కోసం ఫ్రిజ్‌లో బాటిళ్లను ఉంచుతున్నాం. ఇలాంటి ఆధునిక పోకడలతో మన ఆరోగ్యాన్ని మనమే చేజేతులా నాశనం చేసుకుంటున్నామనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఫ్రిజ్‌ వాటర్‌తో అనేక రోగాలు వస్తున్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నీటిని తాగడం వల్ల అందులో ఉండే రసాయనాలతో మానవ శరీరానికి సమస్యలు తలెత్తడంతో పాటు, జీవప్రక్రియ దెబ్బతింటుందని చెబుతున్నారు. కానీ, మట్టి పాత్రలలో నీళ్లు తాగితే దానిలోని క్షార గుణంతో జీవప్రక్రియ మెరుగుపడుతుంది. ఎండకాలంలో అయితే నీళ్లు చల్లగా ఉండడంతోపాటు వాటర్‌ రుచి కూడా బాగుంటుంది. ఒక రకంగా చెప్పాలంటే కుండలో నీళ్లు అమృతంతో సమానమని చెప్పవచ్చు.
మక్కువ చూపుతున్న నేటి తరం
ఆరోగ్యమే మహాభాగ్యమని మన పెద్దలు ఏనాడో చెప్పారు. ఆ ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నంలో నేడు పూర్వ పద్ధతులవైపు మళ్లుతున్నారు. మన తాత, ముత్తాతలు వాడినటువంటి మట్టిపాత్రలవైపు మొగ్గు చూపుతున్నారు. అందుకే ఎక్కడ మట్టిపాత్రలు కనిపించినా కొనేందుకు ఇష్టపడుతున్నారు. రోజువారీగా కాకున్నా వారంతాలు, ఇతర ప్రత్యేక రోజుల్లో మట్టిపాత్రల్లో ఇష్టమైన వంటకాలను చేసుకుంటున్నారు. కంచుడులో చేపల పులుసు వండి టేస్ట్‌ను ఆస్వాదిస్తున్నారు. అలాగే కుండ చికెన్‌ అయితే లొట్టలేసుకుంటూ మరీ తింటున్నారు.
మట్టి పాత్రతో ప్రయోజనాలు
మట్టిపాత్రలు కాల్షియం, పాస్పరస్‌, ఐరన్‌, మెగ్నిషియం, సల్ఫర్‌ వంటి అనేక ముఖ్యమైన పోషకాలను ఆహారంలో చేర్చుతాయి. మట్టి అనేది ఒక ఆల్కలీన్‌ కావడం వల్ల ఆహారంలోని ఆమ్లతను తటస్థం చేస్తుంది. ఇది ఆహారం సులభంగా జీర్ణయం అయ్యేటట్టు చేస్తుంది. ముఖ్యంగా మట్టి కుండలో వంట చేసేందుకు నూనె అవసరం ఉండదు. అందువల్ల ఇందులో కొలెస్ట్రాల్‌ బాధ ఉండదు. ఆహారం ద్వారా వచ్చే క్యాన్సర్లను సమర్థవంతంగా ఇది అడ్డుకుంటుంది. జీర్ణ సంబంధ వ్యాధులు అల్సర్స్‌, అలాగే గుండె సంబంధిత వ్యాధులతో బాధ పడేవారికి మట్టి పాత్ర వంటకాలు ఎంతో మేలు చేస్తాయి.

ఇవి కూడా చూడండి..

గ్రేటర్‌ బడ్జెట్‌ రూ.559.77కోట్లు

మహారాష్ట్రలో కొత్తగా 40,414 ‌కరోనా కేసులు

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
వంటింట్లోకి మట్టి పాత్ర

ట్రెండింగ్‌

Advertisement