హైదరాబాద్: మిషన్ రేబిస్ పేరుతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ మంచి ఫలితాలను ఇచ్చిందని రాష్ట్ర పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఆర్వింద్ కుమార్ ట్విట్టర్లో పేర్కొన్నారు. బ్లూ క్రాస్ హైదరాబాద్, డబ్ల్యూవీఎస్ చారిటీ సంస్థలతో కలిసి నెలరోజుల పాటు రేబిస్ వ్యాధి నివారణ కోసం వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించామని, వెటర్నిటీ అధికారులు నగరంలో ఉన్న వీధి కుక్కలను గుర్తించి వాటికి రేబిస్ టీకాలను వేశారని తెలిపారు.
శనివారం ఉదయం రేబిస్ ఫ్రీ సిటీపై ప్రత్యేక ర్యాలీ, చర్చా కార్యక్రమాన్ని మాదాపూర్‌లో నిర్వహించారు. రోజురోజుకు పెరుగతున్న వీధి కుక్కల సంఖ్యను కట్టడి చేయడంతో పాటు కుక్క కాటు ప్రమాదకరం కాకుండా ఉండేందుకు జీహెచ్ఎంసీ ప్రత్యేక చర్యలు చేపట్టిందని అర్వింద్‌కుమార్ పేర్కొన్నారు. ఆగస్టు 15 నాటికి రేబిస్ ఫ్రీ నగరంగా మార్చామని, దాన్ని స్ఫూర్తిగా తీసుకొని రేబిస్ ఫ్రీ తెలంగాణ పేరుతో ప్రత్యేక కార్యక్రరమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు.