కావలసిన పదార్థాలు
ఆలుగడ్డలు: నాలుగు, గుడ్లు: రెండు, ఉల్లిగడ్డ: ఒకటి, పచ్చిమిర్చి: మూడు, మిరియాల పొడి: పావు టీస్పూన్, కారం: అర టీస్పూన్, ఉప్పు: తగినంత, పసుపు: పావు టీస్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్: పావు టీస్పూన్, నూనె: సరిపడా.
తయారీ విధానం
ఆలుగడ్డలను వీలైనంత సన్నగా, చిన్నగా తరిగి అరగంటపాటు నీళ్లలో నానబెట్టాలి. స్టవ్‌మీద గిన్నెపెట్టి రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడయ్యాక సన్నగా తరిగిన ఉల్లిగడ్డ, నీళ్లు లేకుండా వంపేసిన ఆలుగడ్డ ముక్కల్ని వేసి పదినిమిషాలపాటు బాగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో గుడ్లు వేసి కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, మిరియాల పొడి వేసి బాగా కలిపి.. వేయించి ఆలు ముక్కల్ని వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి రెండు టీస్పూన్ల నూనెవేసి, వేడయ్యాక ఆలూ మిశ్రమాన్ని ఆమ్లెట్‌లా పరుచుకుని రెండువైపులా కాల్చుకుంటే ఆలూ ఆమ్లెట్ సిద్ధం.