Pregnat Teen Murder | జార్ఖండ్‌లోని దుమ్కా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. గర్భవతి అయిన 14 ఏండ్ల గిరిజన బాలిక మృతదేహం ఒక చెట్టుకు వేలాడుతూ కనిపించిన ఘటన శుక్రవారం వెలుగు చూసింది. ఈ ఘటనలో సదరు గిరిజన బాలికపై లైంగిక దాడి చేసి, అటుపై హత్య చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు శనివారం తెలిపారు. ఇటీవలే దుమ్కాలో ఒక వేటగాడు ఒక బాలికను అగ్నికి ఆహుతి చేసిన ఘనట వెలుగు చూసింది.
తాజాగా వెలుగు చూసిన గిరిజన మహిళ మృతదేహం ఘటనలో నిందితుడు అర్మాన్ అన్సారీని రేపు కోర్టులో ప్రవేశ పెడతామని దుమ్కా జిల్లా పోలీస్ ఆఫీసర్ సుదర్శన్ ప్రసాద్ మండల్ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ చట్టం, పోక్సో చట్టాలతోపాటు లైంగిక దాడి, హత్యకు పాల్పడినట్లు కేసు నమోదు చేశారు.
రాణిశ్వర్కు చెందిన సదరు గిరిజన యువతి.. అక్కడి నుంచి 40 కిమీ దూరంలోని దుమ్కాకు వచ్చి కార్మికురాలిగా పని చేసేది. భవన నిర్మాణ కార్మికుడైన నిందితుడిని అప్పుడప్పుడు కలుసుకునేది. కొన్ని సార్లు దుమ్కా సమీపంలోని శ్రీయంబాలో బంధువుల ఇంట్లో బస చేసేది. పోస్ట్‌మార్టంలో సదరు యువతి గర్భవతి అని తేలింది. ఈ ఘటనపై జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.