జైపూర్, సెప్టెంబర్ 25: రాజస్థాన్ సీఎం మార్పు రాజకీయం తీవ్ర సంక్షోభానికి దారితీసింది. రాష్ట్రంలో ఆదివారం రాత్రి హైడ్రామా చోటుచేసుకున్నది. ప్రస్తుత ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ వర్గానికి చెందిన 82 మంది ఎమ్మెల్యేలు అధిష్ఠానంపై తిరుగుబావుటా ఎగురవేస్తూ మూకుమ్మడి రాజీనామాలు చేశారు. ఈ మేరకు తమ రాజీనామా పత్రాలను అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషికి సమర్పించారు. ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న అశోక్ గెహ్లాట్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీచేస్తున్నారు.
తదుపరి సీఎంగా పార్టీ అధిష్టానం సీనియర్ నేత సచిన్ పైలట్‌ను దాదాపు ఎంపిక చేసినట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న గెహ్లాట్ వర్గం మంత్రులు, ఎమ్మెల్యేలు ఆదివారం సాయంత్రం మంత్రి శాంతి ధరివాల్ నివాసంలో భేటీ అయ్యారు. సీఎంగా పైలట్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ రాజీనామాలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అక్కడి నుంచి బస్సుల్లో స్పీకర్ నివాసానికి చేరుకొని రాజీనామాలు అందించారు.
తిరుగుబాటు వ్యక్తి సీఎంగానా?
తదుపరి సీఎంగా సచిన్ పైలట్ అభ్యర్థిత్వాన్ని గెహ్లాట్ వర్గం ఎమ్మెల్యేలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 2020లో తిరుగుబాటు చేసి ప్రభుత్వాన్ని కూల్చాలని చూసిన వ్యక్తిని ఎలా సీఎం చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గెహ్లాట్ వర్గానికి చెందిన వ్యక్తినే సీఎం చేయాలని అధిష్ఠానాన్ని డిమాండ్ చేశారు. వాస్తవానికి కొత్త సీఎం ఎంపికపై ఆదివారం సాయంత్రం కాంగ్రెస్ సభాపక్ష సమావేశం జరగాల్సి ఉన్నది. ఈ సమావేశానికి ముందే గెహ్లాట్ వర్గంగా భావిస్తున్న ఆయన సన్నిహిత ఎమ్మెల్యేలు మంత్రి ధరివాల్ నివాసంలో భేటీ అయ్యి, రాజీనామా నిర్ణయం తీసుకొన్నారు.
ఆగ్రహంతో ఎమ్మెల్యేలు
రాజస్థాన్‌లో సంక్షోభ పరిష్కారానికి కాంగ్రెస్ అధిష్ఠానం రంగంలోకి దిగింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సీఎం గెహ్లాట్‌తో ఫోన్లో మాట్లాడారు. అయితే ఈ సందర్భంగా సీఎంగా పైలట్ ఎంపికపై గెహ్లాట్ అసంతృప్తిని వెల్లగక్కినట్టు సమాచారం. ‘నా చేతుల్లో ఏం లేదు. ఎమ్మెల్యేలు అందరూ ఆగ్రహంగా ఉన్నారు’ అని వేణుగోపాల్‌కు స్పష్టం చేసినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
కొత్త తరానికి అవకాశం రావాలి: గెహ్లాట్
కాగా, అంతకుముందు జైసల్మేర్‌లోని ఓ ఆలయంలో ప్రార్థనలకు వచ్చిన గెహ్లాట్ మీడియాతో మాట్లాడుతూ ‘40 ఏండ్లుగా పలు రాజ్యాంగ పదవుల్లో పనిచేశాను. ఇంకా నేను ఏం పొందాలని కోరుకుంటాను? కాబట్టి, కొత్త తరానికి అవకాశం రావాలనేది నా మనసులో ఉన్నది’ అని వ్యాఖ్యానించారు.