బంజారాహిల్స్, సెప్టెంబర్ 28: హీరో మహేశ్‌బాబు ఇంట్లోకి అర్ధరాత్రి ప్రవేశించిన యువకుడు.. పారిపోయే క్రమంలో గోడ దూకడంతో తీవ్ర గాయాలయ్యాయి. అదుపులోకి తీసుకున్న పోలీసులు చికిత్స నిమిత్తం అతడిని ఆస్పత్రికి తరలించారు. జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. జూబ్లీహిల్స్ రోడ్ నం. 81లో హీరో మహేశ్ బాబు నివాసం ఉంది. ఒడిశాకు చెందిన కృష్ణ మంగళవారం అర్ధరాత్రి మహేశ్ బాబు ఇంటి ప్రహరీ ఎక్కి.. ఇంటి ఆవరణలోకి ప్రవేశించాడు.
కొద్ది సేపటి తర్వాత అలికిడి కావడంతో ఇంటి బయట డ్యూటీలో ఉన్న సెక్యూరిటీ సిబ్బంది గమనించి అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. దీంతో కృష్ణ ప్రహరీ ఎక్కి బయటకు దూకగా.. అతడికి తీవ్ర గాయాలయ్యాయి. సెక్యూరిటీ సిబ్బంది అతడిని పట్టుకొని.. జూబ్లీహిల్స్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. నిందితుడు కృష్ణను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఇటీవలే నగరానికి వచ్చిన కృష్ణ ఓ నర్సరీలో పనిచేస్తున్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.