ఎల్లారెడ్డి, జనవరి 16: పుష్కలంగా సాగు నీరు అందుబాటులో ఉండే పోచారం ప్రాజెక్టు ఆయకట్టు రైతుల్లో మార్పు మొదలైంది. వానకాలంతోపాటు యాసంగిలో సైతం వరి మాత్రమే పండించే రైతులు ప్రభుత్వ ప్రయత్నం, పరిస్థితుల ప్రభావంతో మార్పువైపు అడుగులు వేస్తున్నారు. నీటి సౌకర్యం ఉన్నప్పటికీ వేరుశనగతోపాటు ఈసారి ఎర్రజొన్న సాగుకు ముందుకొచ్చారు. గతంలో ఎప్పుడూ సాగు చేయని ఎర్రజొన్న పంటను వేసిన రైతులు మంచి దిగుబడి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎర్రజొన్నలు అంటేనే ఆర్మూర్ వైపు పండే పంట అనే అర్థాన్ని మారుస్తామని, తాము సైతం మంచి దిగుబడి సాధిస్తామని పేర్కొంటున్నారు. ప్రాజెక్టు (బీ) జోన్ పరిధిలోకి వచ్చే ఎల్లారెడ్డి మండలం జంగమాయపల్లి, అల్మాజీపూర్, రుద్రారం తదితర గ్రామాల్లో రైతులు ఈసారి యాసంగిలో ఎర్రజొన్న వేశారు. విత్తనాల ఖర్చు తక్కువగా ఉండడంతోపాటు పెట్టుబడి తక్కువగా ఉండే ఎర్రజొన్నలను సాగు చేస్తున్నారు. రెండు నెలలుగా వ్యవసాయ శాఖ అధికారులు సైతం ఆరుతడి పంటలపై అవగాహన కల్పించడం, ఆర్మూర్ ప్రాంతం నుంచి మంచి సంబంధాలు ఉండడంతో ఎర్రజొన్న పండించేందుకు ఇక్కడి రైతులు ముందుకు వస్తున్నారు.
ఎకరం సాగుకు ఐదు వేల ఖర్చు..
తక్కువ ఖర్చుతో సాగు చేసే పంటల్లో ఎర్రజొన్న ఒకటి. యాసంగిలో సులభంగా సాగుచేసే అవకాశం ఉన్న పంటగా దీనికి గుర్తింపు ఉంది. వరి కోసిన తర్వాత దుక్కిని రెండుసార్లు దున్నితే సరిపోతుంది. దీంట్లో లప్ప ఎక్కువగా ఉంటే ఒకసారి గొర్రులాగితే భూమి అనుకూలంగా మారుతుంది. ఎకరానికి రూ.400 విలువచేసే విత్తనాలు సరిపోతాయి. ఇద్దరు కూలీలు ఉంటే ఎకరం భూమిలో విత్తనాలు వేయచ్చు. అడుగు మందు, కూలీల డబ్బులు, అవసరమైన పురుగు మందు కలిపితే ఎకరానికి ఐదు వేలకు మించి ఖర్చు రాదు. సాగు నీరు సైతం నాలుగైదు తడులు ఉంటే సరిపోతుంది. చలికాలం మూలంగా ఒకసారి మొలక వస్తే మంచుతోనే ఎక్కువగా ఈ పంట పెరుగుతుందని చెబుతున్నారు రైతులు. పంట చేతికి వచ్చే సమయంలో ఓ నెల రోజుల పాటు పక్షులు వాలకుండా జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది.
ఎకరానికి 15 నుంచి 18 క్వింటాళ్ల దిగుబడి…
ఎర్రజొన్నలు ఎకరానికి 15 నుంచి 18 క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. ఎర్రజొన్న ధర ప్రస్తుతం మార్కెట్లో క్వింటాలుకు నాలుగు వేల రూపాయలు ఉన్నప్పటికీ పంట వచ్చే సమయానికి అది రూ.2400 నుంచి రూ.3వేల వరకు ఉంటుందని, దీంతో ఎకరానికి కనీసం 15 క్వింటాళ్లు వచ్చినా రూ.36వేలు వస్తాయని, పెట్టుబడి పోతే ఎకరానికి రూ.30వేల వరకు మిగిలే అవకాశం ఉంటుందని రైతులు పేర్కొంటున్నారు.
మొదటిసారి ఏసిన..
30 ఏండ్ల నుంచి ఎవుసం చేస్తున్న. మొదటిసారి ఎర్రజొన్న పంట ఏసిన. ఈడ వానకాలం, యాసంగిల వరి పంటనే పండించేటోళ్లం. ఆఫీసర్లు రెండు సార్లు మీటింగులు పెట్టి వరి వేయద్దని చెప్పిండ్రు. అందుకే గుర్తున్న వాళ్లు ఆర్మూర్ నుంచి విత్తనాలు తెచ్చి ఏస్తే వాళ్లను చూసి నేను కూడా ఈసారి ఎర్రజొన్న ఏసిన.
ఎర్రజొన్న పంటే అల్కగా ఉంటది..
నేను నాలుగు ఎకరాల్లో ఎర్రజొన్న పంట ఏసిన. ఇప్పుడు వరి పండిద్దమంటే పెట్టుబడి ఎక్కువ. రోగాలు గూడ వస్తున్నయ్. కొనేవారు కూడ లేరు. దీని కన్నా ఎర్రజొన్న పండించుడే అల్కాటి పని. ఇంటోళ్లందరం కలిసి ఇత్నాలు ఏసినం. కర్సులు కూడ పెద్దగా ఏంలేవు. బోరున్నది, నీళ్లకు బాధ లేదు. కంకి పెట్టేటప్పుడు ఇంటోళ్లందరం ఉట్టిగనే ఉంటం కదా. ఇంటికాడ ఉండేదాని కన్నా పంట కావలి ఉంటే చాలు. ఎకరానికి 15 క్వింటాళ్ల కన్నా ఎక్కువనే పండిస్తాం. ఎంతలేదన్నా 30వేల కన్నా ఎక్కువే లాభం వస్తదంట.
కల్పించాం..
నీటి వనరులు ఉన్నప్పటికీ వరి కన్నా ఇతర పంటలు పండించడం లాభదాయకమని రైతులకు అవగాహన కల్పించాం. ఎల్లారెడ్డి మండలంలో చాలా మంది రైతులు ఇతర పంటలను సాగు చేస్తున్నారు. పోచారం ప్రాజెక్టు (బీ) జోన్ కింద మొదటిసారి ఎర్రజొన్న పంటను సాగు చేస్తున్నారు. మంచి దిగుబడి వస్తే వచ్చే యాసంగిలో వందల ఎకరాల్లో సాగు చేసే అవకాశం ఉంటది.
-రవీందర్, ఏఈవో, ఎల్లారెడ్డి