వాషింగ్టన్: అంగారక గ్రహంపై పర్సీవరెన్స్ రోవర్.. ఫస్ట్ డ్రైవ్ చేపట్టింది. ఆరు వీల్స్ ఉన్న రోవర్ సుమారు 6.5 మీటర్లు ప్రయాణం చేసింది. 33 నిమిషాల పాటు ఆ ప్రయాణం సాగినట్లు నాసా చెప్పింది. నాలుగు మీటర్లు ముందుకు వెళ్లిన తర్వాత 150 డిగ్రీలు ఎడమవైపు మళ్లింది. ఆ తర్వాత మళ్లీ వెనక్కి 2.5 మీటర్లు వెళ్లినట్లు శాస్త్రవేత్తలు చెప్పారు. టెస్ట్ డ్రైవ్ అద్భుతంగా సాగినట్లు పెర్సీవరెన్స్ ఇంజినీర్ అనాయిస్ జారిఫియన్ తెలిపారు. రోవర్ ముందుకు వెళ్లడం తమ ప్రాజెక్టులో ఓ మైలురాయి అని ఆమె పేర్కొన్నారు. కొన్ని రోజుల్లో లాంగ్ డ్రైవ్‌లు చేపట్టనున్నట్లు ఆమె తెలిపారు. టెస్ట్ డ్రైవ్ చేపట్టిన ప్రాంతాన్ని ఆక్టేవియా ఈ బట్లర్ ల్యాండింగ్గా నామకరణం చేశారు. దివంతగ సైన్స్ ఫిక్షన్ రచయితకు గౌరవంగా ఆ పేరును ప్రతిపాదించారు. అయితే లాంగ్ డ్రైవ్ చేపట్టేందుకు కావాల్సిన మార్గాలను అన్వేషిస్తున్నట్లు నాసా ఇంజినీర్లు వెల్లడించారు.
మార్స్ గ్రహం ఒక రోజు సమయంలో రోవర్ షుమారు 200 మీటర్లు ప్రయాణించగలదు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మార్స్‌పై ఒక రోజు సమయం భూమితో పోలిస్తే కొంత ఎక్కువగా ఉంటుంది. గతంలో అంగారక గ్రహంపై పంపిన క్యూరియాసిటీ రోవర్ కన్నా అయిదు రెట్లు వేగంతో పర్సీవరెన్స్ వెళ్తున్నట్లు శాస్త్రవేత్తలు చెప్పారు. మార్స్‌పై ల్యాండింగ్ అయిన 8 ఏళ్ల తర్వాత కూడా క్యూరియాసిటీ ఇంకా పనిచేస్తున్నది. రోవర్‌కు టెస్ట్ డ్రైవ్ చేసిన శాస్త్రవేత్తలు.. త్వరలోనే హెలికాప్టర్ డ్రోన్‌ను కూడా పరీక్షించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఎటువంటి రోవర్‌కు ఎటువంటి సమస్యలు తలెత్తలేదని శాస్త్రవేత్తలు చెప్పారు.