స్వచ్ఛ ‘పెద్దపల్లి’ కోసం బల్దియా వినూత్న కార్యక్రమం
రోడ్లపక్కన చెత్త, ప్లాస్టిక్
వేసే వారి ఫొటో తీసి పంపేవారికి నగదు ప్రోత్సాహం
జిల్లా కేంద్రంలో భారీ అవగాహన ర్యాలీ
బట్ట సంచుల పంపిణీ
పాల్గొన్న ఎమ్మెల్యే దాసరి
పెద్దపల్లి, జూలై 4: ‘స్వచ్ఛ పెద్దపల్లి’ కోసం బల్దియా పకడ్బందీ చర్యలు చేపడుతున్నది. ఒక సారి వాడి పారేసే ప్లాస్టిక్‌ను అమ్మినా.. ఉపయోగించిన వారిపై భారీ జరిమానా విధిస్తామని హెచ్చరిస్తున్నది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నియంత్రణ, చెత్త రహితానికి ‘ఫొటో కొట్టు.. గిఫ్ట్ పట్టు’ పేరిట సరికొత్త కార్యక్రమం చేపట్టింది. రోడ్లు, ఖాళీ స్థలాలు, మురుగు కాలువల్లో చెత్త, వ్యర్థ పదార్థాలు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను వేసే వారి ఫొటో తీసి వాట్సాప్ నంబర్ 63099 99940కు పంపితే రూ.500 పారితోషికం ఇస్తామని ప్రకటించారు. అలాగే చెత్త వేసిన వారికి రూ.500 నుంచి రూ.10వేల ఫైన్ వేయాలని నిర్ణయించారు. ఈ మేరకు సోమవారం బల్ది యా చైర్ పర్సన్ దాసరి మమతారెడ్డి ఆధ్వర్యం లో పెద్దపల్లి పట్టణంలో భారీ అవగాహన ర్యాలీ తీశారు.
అయ్యప్ప ఆలయం నుంచి ఒగ్గు డోలు ప్రదర్శనలు, కోలాటాల మధ్య అమర్ చౌరస్తా, మసీద్ చౌరస్తా మీదుగా జెండా చౌరస్తా వరకు ర్యాలీ తీశారు. అక్కడ మానవహారంగా ఏర్పడి, ప్లాస్టిక్ నియంత్రణకు ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే దాసరి మనోహరెడ్డి కూడా పాల్గొన్నారు. ‘స్వచ్ఛ పెద్దపల్లి’ పేరిట తయారు చేయించిన బట్ట సంచులను ఆవిష్కరించారు. అనంతరం ప్రజలకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ నజ్మీన్ సుల్తానా మొబిన్, కమిషనర్ సీహెచ్ తిరుపతి, కౌన్సిలర్లు లైశెట్టి భిక్షపతి, చంద రమాదేవి శ్రీధ ర్, పెద్ది గీతాంజలి వెంకటేశ్, ఎరుకల కల్పనా రమేశ్, కొమిరిశెట్టి కనకలక్ష్మి శ్రీకాంత్, బొంకూరి భాగ్యలక్ష్మీ సురేందర్, గాదె మాధవి, పూదరి చంద్రశేఖర్, షాహెద అంజుమ్ సాబీర్ ఖాన్, స్వామి, కార్తీక్, పైడ పద్మ రవి, పోతని పురుషోత్తం, కో ఆప్షన్ సభ్యులు ఫయూం, మల్ల మ్మ, చంద్రమౌళి, మున్సిపల్ మేనేజర్ శివప్రసాద్, ఏఈ సతీశ్, మున్సిపల్ సిబ్బంది ఉన్నారు.
ప్లాస్టిక్ నియంత్రణకు పటిష్ట చర్యలు
ప్లాస్టిక్ వాడడం వల్ల పర్యావరణం దెబ్బతినడమే కాకుండా మానవాళి మనగడ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదమున్నది. పర్యావరణ పరిరక్షణతోపాటు భవిష్యత్తు తరాల కోసం ప్రభుత్వం సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధిస్తూ ఉత్వర్వులు జారీ చేసింది. పట్టణంలో సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ (ఒక సారి వాడి పారేసే ప్లాస్టిక్) నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకుంటాం. ప్రజలు కూడా సహకరించాలి. పచ్చని, పరిశుభ్రమైన పట్టణంగా పెద్దపల్లిని తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నాం.
– ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి
ప్రజలు సహకరించాలి
పెద్దపల్లి పట్టణంలో నిషేధిత ప్లాస్టిక్‌ను పూర్తి స్థాయిలో నియంత్రించేందుకు కృషి చేస్తున్నాం. వ్యాపారులు, ప్రజలు సహకరించాలి. నిషేధిత ప్లాస్టిక్‌ను అమ్మినా, వినియోగించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. స్వచ్ఛ పెద్దపల్లిలో భాగంగా ‘ఫొటో కొట్టు… గిఫ్ట్ పట్టు’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. రోడ్లు, ఖాళీ స్థలాలు, మురుగు కాలువల్లో చెత్త, వ్వర్థ పదార్ధాలు వేసే వారి ఫొటో తీసి వాట్సాప్ చేస్తే ఫొటో పంపిన వారి ఇంటికెళ్లి రూ. 500 నగదు పారితోషికం అందిస్తాం.
– మున్సిపల్ చైర్ పర్సన్ దాసరి మమతారెడ్డి