న్యూఢిల్లీ: ముకేశ్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్ రిటైల్‌లో విలీనానికి గ్లోబల్ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ అడ్డుపుల్ల వేయడంతో దేశీయ రిటైల్ నెట్వర్క్ చైన్ ఫ్యూచర్ రిటైల్ విలవిల్లాడుతున్నది. రిలయన్స్‌తో డీల్ విషయమై ముందుకెళ్లకుంటే ఫ్యూచర్ రిటైల్ నెట్‌వర్క్‌కు బ్యాంకులు మొండి బాకీల ట్యాగ్ తగిలించే అవకాశం ఉన్నదని తెలుస్తున్నది.
బ్యాంకుల వద్ద లిస్టెడ్ కంపెనీల ద్వారా దాదాపు రూ.20 వేల కోట్ల పై చిలుకు, అన్‌లిస్టెడ్ కంపెనీల ద్వారా రూ.10 వేల కోట్ల మేరకు ఫ్యూచర్ రిటైల్స్ తీసుకున్నట్లు తెలుస్తున్నది.కానీ గతేడాది కరోనా మహమ్మారి దాడి వల్ల ఫ్యూచర్ రిటైల్ బిజినెస్ దెబ్బ తిన్నది.
ఫ్యూచర్ రిటైల్ బిజినెస్ రూ.25 వేల కోట్లకు పడిపోయింది. అప్పటికే నష్టాల్లో ఉన్న ఫ్యూచర్ రిటైల్..అప్పుల ఊబిలో చిక్కుకున్నది.
ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్ అనుబంధ బ్రాండ్లయిన బిగ్ బజార్, ఫ్యూచర్ లైఫ్ స్టైల్ ఫ్యాషన్స్ ప్రధానంగా సుమారు రూ.20 వేల కోట్ల రుణ బకాయిలు కలిగి ఉన్నాయి. ఇక అన్ లిస్టెడ్ కంపెనీలు మరో రూ.10వేల రుణాలు తీసుకున్నట్లు బ్యాంకర్లు అంచనా వేస్తున్నారు.
ఈ నేపథ్యంలో అప్పులు, నష్టాల నుంచి బయటపడేందుకు యావత్ తన నెట్‌వర్క్‌ను రిలయన్స్ రిటైల్‌లో విలీనం చేసేందుకు ఫ్యూచర్ రిటైల్ సీఈవో కిశోర్ బియానీ సిద్ధం అయ్యారు. ఈ మేరకు గతేడాది ఆగస్టు చివరిలో రిలయన్స్ రిటైల్‌తో రూ.24,713 కోట్ల డీల్‌పై సంతకాలు చేశారు కిశోర్ బియానీ.
దీనిపై గ్లోబల్ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ అభ్యంతరం వ్యక్తం చేయడంతోపాటు న్యాయ పోరాటానికి దిగింది. దీంతో కిశోర్ బియానీ, ఫ్యూచర్ రిటైల్ గ్రూప్ కష్టాలు ఒకటి తర్వాత ఒకటి మొదలయ్యాయి.
అమెజాన్‌కు ఫ్యూచర్స్ రిటైల్ గ్రూప్ అనుబంధ ఫ్యూచర్స్ కూపన్స్‌లో 49 శాతం వాటాలు ఉన్నాయి. ఈ డీల్ ఇంకా పూర్తి కాకముందే సంస్థను రిలయన్స్ రిటైల్‌లో విలీనం చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై అమెజాన్.. సింగపూర్ అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కోర్టు, ఢిల్లీ హైకోర్టుల్లో న్యాయపోరాటం చేస్తున్నది.
తాజాగా సుప్రీంకోర్టులో ఈ నెల 27న దీనిపై విచారణ జరుగనున్నది.సుప్రీంకోర్టులో ఈ అంశం విచారణకు వచ్చేలోగా రుణాల చెల్లింపు లేదా పున్వ్యవస్థీకరణకు ప్రణాళికలు రూపొందించే పనిలో పడింది ఫ్యూచర్ రిటైల్.
మూడు నెలల గడువు దాటితే ఫ్యూచర్ గ్రూప్ రుణాలను మొండి బకాయిలుగా బ్యాంకులు ప్రకటించేస్తాయి. కానీ రుణాల పునర్వ్యవస్థీకరణ ప్రణాళికను చురుగ్గా పరిశీలిస్తున్నట్లు ఫ్యూచర్ గ్రూప్ వర్గాలు తెలిపాయి.
రుణాల మారటోరియంపై సుప్రీంకోర్టు ఇటీవలి తీర్పు నేపథ్యంలో గురువారం నాడే బిగ్ బజార్, బ్రాండ్ ఫ్యాక్టరీ, ఫ్యూచర్ కూపన్స్ తదితర సంస్థల సమ్మేళనం ఫ్యూచర్ రిటైల్ తీసుకున్న రుణాలను మొండి బాకీలుగా ప్రకటించాల్సి ఉంది.
సీనియర్ బ్యాంకర్ ఎగ్జిక్యూటివ్ చెప్పిన వివరాల ప్రకారం ఫ్యూచర్ గ్రూప్ సంస్థకు ఇచ్చిన రుణాలపై రిజొల్యూషన్ ప్లాన్ సిద్ధంగా ఉందని, ఈ నెల 26 వరకు ఆమోదించడానికి టైం ఉందని తెలుస్తున్నది. రుణాలను పునర్వ్యవస్థీకరిస్తే పరిస్థితుల్లో తేడా రావచ్చు.
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
బంపరాఫర్: సర్కారీ ఉద్యోగులకు లక్ష ఎలక్ట్రిక్ టూ వీలర్స్
ఇన్వెస్టర్లూ.. బీ వేర్: ఏప్రిల్‌లో 11 రోజులు సెలవులే!