ఉస్మానియా యూనివర్సిటీ: ప్రతిష్టాత్మక ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల, ప్రిజర్వ్ లర్న్ ఎడ్యుకేషన్ ఇన్ ఆర్ట్ కల్చర్ అండ్ హెరిటేజ్ (ప్లీచ్) మధ్య అవగాహనా ఒప్పందం కుదరనుంది. ప్లీచ్ అనే సంస్థ చరిత్ర, పురావస్తు విభాగాల పరిశోధనా సంస్థ. దీనికి సంబంధించిన అన్ని చర్చలు ఇప్పటికే పూర్తయ్యాయని, మంగళవారం మధ్యాహ్నం కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ గణేశ్, ప్లీచ్ సంస్థ ప్రతినిధులు ఒప్పందంపై సంతకాలు చేస్తారని ఓయూ చరిత్ర విభాగం హెడ్ ప్రొఫెసర్ అర్జున్‌రావు కుతాడి ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ ఒప్పందం ప్రకారం చరిత్ర విభాగానికి చెందిన అధ్యాపకులు, పరిశోధక విద్యార్థులు, పీజీ విద్యార్థులకు ప్రత్యేక విద్య, పరిశోధనా అంశాలను సంస్థ తరపున అందిస్తారని చెప్పారు. శత వసంతాల చరిత్ర కలిగిన చరిత్ర విభాగంలో ఇప్పటి వరకు ఇటువంటి అవగాహనా ఒప్పందం జరుగలేదన్నారు. ఇది తన హయాంలో జరగడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.