నర్సాపూర్, జనవరి 20 : సంగారెడ్డి జిల్లా కొం డాపూర్ మండలం మల్కాపూర్‌లో పద్మావతి నర్సింహారెడ్డి దంపతులకు జన్మించిన ఆభర్ణ, విద్యార్థి దశ నుంచే సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేది. ఎవరైనా ఆపదలో ఉన్నారంటే వారిని అక్కున చేర్చుకునేది. సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం కొండారెడ్డిపల్లికి చెందిన సుధాకర్‌రెడ్డితో (1992లో) ఆమెకు వివాహం జరిగింది. మొదట్లో గృహిణిగానే ఉన్నప్పటికీ సమాజానికి ఏదైనా సేవ చేయాలనే భావన ఆమెలో కలిగింది. మొదట ఎన్జీవోలో చేరి సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకున్నది. సమాజంలో వృద్ధులు పడుతున్న బాధలు, కొందరు తల్లిదండ్రులను వదిలివేస్తున్న సంఘటనలు ఆభర్ణను కలిచివేశాయి. ఎలాగైనా వృద్ధాశ్రమం స్థాపించి సేవ చేయాలని నిర్ణయించుకున్నది.
నర్సాపూర్‌లో విజన్ వృద్ధాశ్రమం స్థాపన..
దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వృద్ధుల సమస్యలను గమనించి 2017లో మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో అద్దెకు గదులు తీసుకుని విజన్ వృద్ధాశ్రమాన్ని ఆభర్ణ స్థాపించింది. ప్రస్తుతం 25 మంది వృద్ధులకు ఆశ్రయం కల్పిస్తున్నది. వృద్ధులకు చక్కటి వసతి, పౌష్టికాహారం, వినోదం, మానసికోల్లాసం కోసం కౌన్సిలింగ్, శారీరక ఆరోగ్యం కోసం యోగా, ఆట పాటలతో ఉత్తేజ పర్చడం తదితర సౌకర్యాలను ఆశ్రమంలో కల్పిస్తున్నది. రోజూ వృద్ధులకు ఏఎన్ఎంలతో ఆరోగ్య పరీక్షలు చేయిస్తున్నారు. వృద్ధులకు అందిస్తున్న సేవలను గుర్తించి ఆభర్ణకు రావి నారాయణరెడ్డి అవార్డు వరించింది. అలాగే అప్పటి మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి నుంచి ఉత్తమ అవార్డు సైతం అందుకున్నది. ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి నుంచి అవార్డు అందుకున్నది.
తల్లిదండ్రులే మొదటి గురువులని అన్నారు పెద్దలు. దేవుడి కన్నా ముందుస్థానం అమ్మానాన్నలకే దక్కుతుందని వేదాలు చెబుతున్నాయి. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండగా రానురాను అవి కనుమరుగయ్యాయి. భార్యాభర్తలు ఉద్యోగాలు చేస్తుండడంతో వృద్ధులను చూసుకోవడం కష్టంగా మారింది. దీంతో తల్లిదండ్రులకు ఆదరణ, సహకారాలు అందడం లేదు. సమాజంలో వృద్ధులు పడుతున్న బాధలు, కొందరు తల్లిదండ్రులను వదిలివేస్తున్న సంఘటనలు ఆభర్ణను కలిచివేశాయి. వృద్ధాశ్రమం ఏర్పాటు చేసి వృద్ధులను అక్కున చేర్చుకుంటున్నది.
నిరుపేద వృద్ధులకు ఉచితంగా ఆశ్రయం..
నిరుపేద వృద్ధులకు (స్త్రీలు, పురుషులు) మా ఆశ్రమంలో ఉచితంగా ఆశ్రయం కల్పిస్తున్నాం. ఇలాంటి వారు ఎక్కడైనా తారసపడితే మా ఆశ్రమాన్ని సంప్రదించండి. వృద్ధులను ఆశ్రమంలో చేర్పించండి. దాతల సహకారం ఎల్లప్పుడూ స్వీకరిస్తాం. వృద్ధులకు సరిపడా గదులు లేక ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం లేదా దాతలు ముందుకు వచ్చి స్థలాన్ని ఇప్పిస్తే అన్ని సౌకర్యాలతో ఆశ్రమాన్ని నిర్మిస్తాం.
ఆనందంగా ఉంది..
ఆశ్రమంలో వృద్ధులకు సేవ చేయడం చాలా ఆనందంగా ఉంది. భోజనం, ఆరోగ్యపరంగా వృద్ధులను ఎప్పుడూ పర్యవేక్షిస్తాం. శేష జీవితం ఆనందంగా గడపడానికి వారిని ఆటాపాటలతో ఉత్తేజ పరుస్తాం. ఆనందంగా ఉండేలా చేస్తాం..
-అలేఖ్య, పర్యవేక్షకురాలు
అన్ని సౌకర్యాలు..
నాకు కొడుకులు లేరు.. కూతురు హాస్టల్లో చదువుకుంటున్నది. భర్త, నేను ఆశ్రమంలో ఉంటున్నాం. ఆశ్రమంలో ఉచితంగా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. బయట మాకు బతుకే లేకుండే. ఇక్కడికి వచ్చిన తర్వాత జీవితంపై ఆశ కలిగింది.
-పూజారి సుధ
బాగా చూస్తున్రు..
నాకు ముగ్గురు కొడుకులు చనిపోయారు. కోడళ్లు పట్టిం చుకోలె. ఇంట్లోంచి బయటికి వచ్చి తూప్రాన్‌లోని ఆలయంలో ఉన్న. కొందరు నన్ను ఆశ్రమం లో చేర్పించారు. నన్ను బాగా చూసుకుంటున్నారు.
-కాశమ్మ
ఆభర్ణ సల్లగా ఉండాలె
నాకు కొడుకులు, కూతుళ్లు ఉన్నా, నన్ను భారంగా భావించి ఆశ్రమంలో చేర్పించారు. కొడుకులు రారు. కూతుళ్లు ఈ మధ్యలో వస్తున్నారు. నాకు ఇక్కడే బాగున్నది. మా మేడం ఆభర్ణ సల్లగాఉండాలె.
-వజ్రమ్మ