నారాయణపేట: జిల్లాలోని మాగనూరు వద్ద పెను ప్రమాదం తప్పింది. వేగంగా దూసుకొచ్చిన ఆరెంజ్ ట్రావెల్స్ (Orange travels) బస్సు మాగనూరువద్ద రోడ్డుపై ఉన్న బర్రెను తప్పించబోయి అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో బస్సులో ఉన్న ఎనిమిది మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులను మహబూబ్నగర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.