ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడుతున్న నయా పేస్ సంచలనం ఉమ్రాన్ మాలిక్.. ఆ ప్రదర్శనలతో జాతీయ జట్టులో చోటు సంపాదించుకున్నాడు. త్వరలో అతడు దక్షిణాఫ్రికా సిరీస్ తో భారత జట్టులో చోటు దక్కించుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే ఈ జమ్మూ కుర్రాడి బౌలింగ్ శైలిని అందరూ పాకిస్తాన్ దిగ్గజ పేసర్ వకార్ యూనిస్ ను పోల్చుతున్నారు. పాకిస్తాన్ స్టార్ పేసర్ షోయభ్ అక్తర్ ఫాస్టెస్ట్ డెలివరీ (గంటకు 161.3 కిలోమీటర్లు) కూడా బ్రేక్ చేస్తాడని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్రాన్ స్పందించాడు.
తాజాగా ఉమ్రాన్ మాట్లాడుతూ.. ‘నా బౌలింగ్ శైలి సహజంగా వచ్చిందే. ఎవరినీ కాపీ కొట్టలేదు. నేను వకార్ యూనిస్ ను ఫాలో కాను. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్ ల బౌలింగ్ అంటే నాకు ఇష్టం. నేను క్రికెట్ లో ఓనమాలు దిద్దేప్పట్నుంచే వారిని ఫాలో అవుతున్నాను..’ అని తెలిపాడు.
ఇక అక్తర్ ఫాస్టెస్ట్ డెలివరీ రికార్డు గురించి స్పందిస్తూ.. ‘ప్రస్తుతానికైతే నా దృష్టంతా బాగా బౌలింగ్ చేయాలి, సౌతాఫ్రికాతో సిరీస్ లో నా దేశం ఐదు మ్యాచులు గెలిచేందుకు నా వంతుగా కృషి చేయాలి అనేదానిమీదే ఉందే తప్ప దాని (షోయభ్ అక్తర్ రికార్డు) మీద లేదు. దాని గురించి తర్వాత ఆలోచిస్తా..’ అని చెప్పాడు.
తనను ఆదరిస్తున్నవారందరికీ ఉమ్రాన్ కృతజ్ఞతలు తెలిపాడు. ‘దేశవ్యాప్తంగా నాకు వస్తున్న మద్దతు, నాపై కురిపిస్తున్న ప్రేమకు నేను వారందరికీ కృతజ్ఞతలు చెబుతున్నాను. నన్ను చూడటానికి నా కుటుంబసభ్యులు, సన్నిహితులు మా ఇంటికి వస్తున్నారు. ఐపీఎల్ తర్వాత కొంచెం బిజీగా గడిపాను. కానీ నా ట్రైనింగ్, ప్రాక్టీస్ ను మాత్రం మిస్ కాలేదు..’ అని వివరించాడీ జమ్మూ కుర్రాడు.