చాలావరకూ చిన్న మొత్తాల పొదుపు పథకాల్ని (పోస్టాఫీసు స్మాల్ సేవింగ్ స్కీమ్స్) కొంతమంది పన్ను ఆదా కోసం వినియోగించుకుంటుంటారు.ఈ పథకాలన్నీ ట్యాక్స్‌ఫ్రీ అనే అపోహలు మదుపుదార్లలో ఉంటుంటాయి. కానీ ప్రతీ పథకమూ ఒక వైపు పన్ను ఆదా ప్రయోజనాల్ని అందిస్తూ మరో వైపు వాటిపై వడ్డీ లేదా రాబడిపై కూడా పన్ను మినహాయింపు ఉంటుందన్నది అపోహ మాత్రమే. కొన్ని పథకాల్లో మాత్రమే ఈ రెండు లాభాల్ని అందించే ఫీచర్లు ఉన్నాయి. ఇవి ఈఈఈ (పెట్టుబడి, వడ్డీ, రాబడి-మూడింటిపై ట్యాక్స్ ఎగ్జంప్షన్) విభాగంలోకి వస్తాయి. అలాగే పోస్టాఫీసు పథకాలపై వచ్చే వడ్డీ, కాలపరిమితి తర్వాత లభించే రాబడిపై పోస్టాఫీసు వద్ద టీడీఎస్ లేనందున, ఇవి ట్యాక్స్‌ఫ్రీ పథకాలుగా భావిస్తుంటారు. ఆ పథకాలపై ఆర్జించే వడ్డీని ఐటీఆర్‌లో పన్ను చెల్లింపుదార్లే పేర్కొనాల్సి ఉంటుంది. పోస్టాఫీసు పొదుపు, పెట్టుబడి స్కీంలు ఏమేం ఉన్నాయి. వాటిలో పన్ను ఆదానిచ్చేవి, పన్నులుండేవి ఓసారి చూద్దామా…
సుకన్య సమృద్ధి యోజన (ఎస్ఎస్వై)
బాలిక తల్లితండ్రులు లేదా సంరక్షకులు వారి ఎస్ఎస్వై ఖాతాను పోస్టాఫీసులో ప్రారంభించవచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల వరకూ పెట్టుబడి చేసి సెక్షన్80 సీ కింద పన్ను మినహాయింపుల్ని పొందొచ్చు. ఎస్ఎస్వై కూడా ఈఈఈ ఫీచర్లనే కలిగిఉంది. దీనిపై వచ్చే వడ్డీ, కాలపరిమితి తర్వాత లభించే మొత్తం ట్యాక్స్ ఫ్రీయే.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్)
పీపీఎఫ్‌లో పన్ను ఆదా, పన్ను రహిత ఫీచర్లు రెండూ వున్నాయి. ఇది ఈఈఈ క్యాటగిరీలోకే వస్తుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల వరకూ చేసే పెట్టుబడికి సెక్షన్ 80సీ కింద డిడెక్షన్ క్లెయిం చేయొచ్చు. దీనిపై వడ్డీ, కాలపరిమితి తర్వాత అందే మొత్తంపై కూడా పన్ను ఉండదు.
నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్)
ఎన్పీఎస్ టైర్వన్ ఖాతాలకు సెక్షన్ 80సీసీడీ (1బీ) కింద ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 50,000 వరకూ డిడెక్షన్ను క్లెయిం చేయొచ్చు. ఎన్పీఎస్ కింద వచ్చే రాబడి, రిటైర్మెంట్ కార్పస్ ద్వారా వచ్చే కమ్యుటేషన్లపై పన్ను ఉండదు.
సేవింగ్స్ అకౌంట్
బ్యాంక్ పొదుపు ఖాతాల్లానే పోస్టాఫీసు పొదుపు ఖాతాల్లో చేసే డిపాజిట్లపై పూర్తి పన్ను మినహాయింపు ప్రయోజనాలు ఉండవు. వీటిపై వచ్చే వడ్డీ కూడా ట్యాక్స్ ఫ్రీ కాదు. సెక్షన్ 80టీటీబీ నిర్ణీత మొత్తం వరకు ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఉన్నాయి. వడ్డీపై టీడీఎస్ అమలుకాదు. ఈ వడ్డీని ఐటీఆర్‌లో డిక్లేర్ చేయాలి.
టైమ్ డిపాజిట్
పోస్టాఫీసుల్లో ఐదేండ్ల కాలపరిమితికి వేసే టైమ్ డిపాజిట్‌పై సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల వరకూ పన్ను ఆదా లభిస్తుంది. కానీ వీటిపై లభించే వడ్డీ ట్యాక్స్ ఫ్రీ కాదు. సీనియర్ సిటిజన్లు మాత్రం సెక్షన్80 టీటీబీ కింద నిర్ణీత వడ్డీ ఆదాయంలో మినహాయింపు పొందొ చ్చు.
మంథ్లీ ఇన్‌కం స్కీమ్ అకౌంట్ (ఎంఐఎస్)
ఎంఐఎస్ ఖాతాల్లో చేసే డిపాజిట్లపై ఇటు పన్ను ఆదా ప్రయోజనాలూ లభించవు. అటు వాటిపై లభించే వడ్డీ ట్యాక్స్ ఫ్రీ కాదు. ఇక వడ్డీపై పన్ను మినహాయింపులు మాత్రం పోస్టాఫీసు టైమ్ డిపాజిట్ల తరహాలోనే ఉంటాయి.
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (ఎన్ఎస్సీ)
ఎన్ఎస్సీలో పెట్టుబడి చేయడం ద్వారా ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల వరకూ సెక్షన్ 80సీ కింద ఇన్వెస్టర్లు పన్ను ఆదా ప్రయోజనాల్ని పొందొచ్చు. వీటిపై వచ్చే వడ్డీపై మాత్రం పన్ను ఉంటుంది. వడ్డీ ఆదాయంపై టీడీఎస్ అమలుకాదు. దీనిని ఐటీఆర్‌లో పేర్కొనాల్సి ఉంటుంది.
కిసాన్ వికాస్ పత్ర (కేవీపీ)
కేవీపీలో చేసే పెట్టుబడులపై పన్ను ఆదా ప్రయోజనమూ ఉండదు. దీనిపై ఆర్జించే వడ్డీ పన్ను రహితం కూడా కాదు. కేవీపీపై టీడీఎస్ వర్తించనందున, కాలపరిమితి ముగిసిన తర్వాత లభించే వడ్డీని ఆ ఏడాది ఐటీఆర్‌లో వెల్లడించాల్సి ఉంటుంది.