సినిమా ఇండస్ట్రీ అంటేనే సెంటిమెంట్. ఇక్కడ దాన్ని నమ్మని వాళ్లు చాలా అరుదుగా ఉంటారు. ఓసారి కలిసొచ్చిందంటే ఆ సెంటిమెంట్ అస్సలు వదులుకోరు. కలిసిరాకపోతే అలాంటి సెంటిమెంట్ జోలికి అస్సలు పోరు. హీరోలైనా.. నిర్మాతలైనా.. దర్శకులైనా ఎవ్వరైనా కూడా సెంటిమెంట్ దాసులే ఉంటారు. ఇప్పుడు నితిన్ సినిమా విషయంలో కూడా ఇదే జరుగుతుంది. ప్రస్తుతం ఈయన నటించిన చెక్ సినిమా ఫిబ్రవరి 26న విడుదల కానుంది. సీనియర్ దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి తెరకెక్కించిన ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. కెరీర్ లో తొలిసారి పక్కా కమర్షియల్ సినిమా చేసానని చెప్తున్నాడు యేలేటి. గతంలో ఈయన సినిమాలు కేవలం ప్రశంసల దగ్గరే ఆగిపోతున్నాయి.
మనమంతా, సాహసం, ప్రయాణం, ఒక్కడున్నాడు.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాలు ప్రశంసలు వచ్చాయి కానీ పైసలు రాలేదు. ఈ సారి చెక్ మాత్రం అలాంటి వాటికి చెక్ పెట్టి తనకు కోట్లు తెచ్చిపెడుతుందని నమ్ముతున్నాడు ఈ దర్శకుడు. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఆనంద ప్రసాద్ ఈ సినిమాను నిర్మించాడు. ఇదిలా ఉంటే చెక్ విషయంలో నితిన్ కూడా చాలా నమ్మకంగా కనిపిస్తున్నాడు. చంద్రశేఖల్ యేలేటి సినిమా అంటే కచ్చితంగా పేరొస్తుందని అందరికీ తెలుసు. నితిన్ కూడా ఇదే అనుకుంటున్నాడు. దాంతో పాటు డబ్బులు బోనస్ అంటున్నాడు నితిన్. దానివెనక ఓ సెంటిమెంట్ ఉంది. ఈయన కెరీర్లో దాదాపు 17 ఏళ్ళ తర్వాత మళ్లీ స్పోర్ట్స్ బేస్డ్ సినిమా చేసాడు.
అప్పుడెప్పుడో 2004లో రాజమౌళి తెరకెక్కించిన సై సినిమాలో నటించాడు నితిన్. అందులో రగ్బీ ఉంటుంది. మళ్లీ ఇన్నేళ్ళ తర్వాత చెస్ అంటూ చెక్ తో వస్తున్నాడు నితిన్. స్పోర్ట్స్ డ్రామాలు ఎప్పుడూ ఆసక్తికరంగా ఉంటాయని.. వాటిని సరైన తీరులో తెరకెక్కిస్తే సంచలనాలు రేపుతాయని ఇదివరకే చాలా సినిమాలు నిరూపించాయి. అందులో సై కూడా ఉంటుంది. చాలా ఏళ్ళ తర్వాత తాను చేసిన ఈ ఆటకు సంబంధించిన సినిమాకు సైతం ప్రేక్షకుల ఆదరణ దక్కుతుందని ధీమాగా చెప్తున్నాడు నితిన్. అప్పుడు సై సినిమాకు కలిసొచ్చిన స్పోర్ట్స్ సెంటిమెంట్.. ఇప్పుడు చెక్ కు కూడా పని చేస్తుందని చెప్తున్నాడు ఈయన. మరి ఈయన నమ్మకాన్ని చెక్ ఎంతవరకు నిలబెడుతుందో చూడాలి.