అమెరికాకు చెందిన ఒక కంపెనీ బంపరాఫర్ ప్రకటించింది. ఎందరో కలలు కనే.. కలల ఉద్యోగానికి దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ ఉద్యోగస్తులు చేయాల్సిన పనేమీ ఉండదట. చుట్టూ ఏం జరుగుతున్నా సరే పట్టించుకోకుండా నిద్రపోవడమే వాళ్ల ఉద్యోగమని తెలిపింది. వినడానికి వింతగా ఉన్నా అగ్రరాజ్యానికి చెందిన కాస్పర్ అనే మ్యాట్రస్ కంపెనీ ప్రకటన ఇదే.
ఈ ఉద్యోగానికి ‘కాస్పర్ స్లీపర్స్’ అని పేరు పెట్టిందా కంపెనీ. ‘‘మా కంపెనీ స్టోర్స్‌లో ప్రశాంతంగా నిద్రపోండి. ప్రపంచంలో ఉన్న వివిధ రకాల పరిస్థితుల్లో ప్రశాంతంగా నిద్రలోకి జారుకోండి. పొరపాటున లేచి ఉన్నప్పుడు మాత్రం.. మీ అనుభవాలను టిక్‌టాక్ వంటి వీడియోల్లో పంచుకోండి. వీటినా మా కాస్పర్ సోషల్ మీడియా ఛానెల్స్‌లో పోస్ట్ చేస్తాం’’ అంటూ ఉద్యోగాన్ని వివరించింది.
అద్భుతంగా నిద్రపోయే సామర్ధ్యం ఉన్నవాళ్లే ఈ ఉద్యోగానికి దరఖాస్తులు చేసుకోవాలని చెప్పిందీ కంపెనీ. నిద్ర పోవడం, దానికి సంబంధించిన విషయాలు మాట్లాడటానికి ఉత్సాహం చూపించడమే ఈ ఉద్యోగానికి అర్హత అని తెలిపింది. ఈ ఉద్యోగం పొందిన వాళ్లు కంపెనీకి పజామాల్లో రావడానికి అనుమతిస్తామని, కంపెనీ వస్తువులను ఉచితంగా అందిస్తామని, వీటితోపాటు పార్ట్ టైం వంటి షెడ్యూల్ ఇస్తామని హామీ ఇచ్చింది.
ఇలా ప్రశాంతంగా నిద్రపోతూ డబ్బులు సంపాదించే ఉద్యోగం కోసం స్థానికులు ఏ రేంజ్లో దరఖాస్తులు చేస్తారో ఊహించుకోవచ్చు. ఈ గురువారం వరకు అభ్యర్థులు తమ దరఖాస్తులు పంపొచ్చని, దీనికోసం తమ నిద్ర స్కిల్స్‌ను టిక్‌టాక్ వీడియోల్లో చూపించాలని కోరింది.