Rajinikanth | రజినీకాంత్‌కు సరైన హిట్ పడి చాలారోజులు అవుతుంది. అప్పుడెప్పుడో 12 ఏండ్ల క్రితం వచ్చిన రోబో తర్వాత ఆస్థాయి విజయం మరొకటి లేదు. భారీ అంచనాలతో ఇటీవల విడుదలైన అన్నాత్తే ( పెద్దన్న ) కూడా నిరాశపరిచింది. మధ్యలో కబాలి, పేట ఫర్వాలేదనిపించాయి. కానీ రజినీ స్థాయికి అవి తక్కువే. దీంతో రజినీ నుంచి బ్లాక్‌బస్టర్ సినిమా చూడాలని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో రజినీకాంత్ 169వ సినిమా గురించి ఒక వార్త తమిళనాట వైరల్ అవుతుంది.
ఎన్నో అంచనాల మధ్య వచ్చిన అన్నాత్తే నిరాశపరచడంతో ఎలాగైనా మంచి హిట్ కొట్టాలని రజినీకాంత్ అనుకుంటున్నాడు. ఫ్యాన్స్ కూడా సూపర్ స్టార్ స్టైల్‌కు తగ్గ సినిమా రావాలని ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన తదుపరి చిత్రం ఎలా ఉండబోతుంది? ఎవరు డైరెక్ట్ చేస్తారనేది ఇంట్రెస్టింగ్గా మారింది. ఈ క్రమంలోనే రజినీ 169వ సినిమా కోసం పలువురు స్టార్ డైరెక్టర్ల పేర్లు వినిపించాయి. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రజినీ 169వ చిత్రానికి నెల్సన్ కుమార్ దర్శకత్వం వహించనున్నట్లు కోలీవుడ్‌లో టాక్ వినిపిస్తుంది. నెల్సన్ చెప్పిన కథ నచ్చడంతో తలైవా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
చేసింది రెండు సినిమాలే అయినా డైరెక్టర్‌గా మంచి పేరు తెచ్చుకున్నాడు నెల్సన్ కుమార్. క్రైమ్ స్టోరీకి ఎంటర్టైన్మెంట్ యాడ్ చేసి హిట్ కొట్టడంలో తనకు ఎవరూ సాటి లేరని కోకిల, వరుణ్ డాక్టర్ సినిమాలతో ఇప్పటికే నిరూపించుకున్నాడు. ఇక మూడో సినిమాకే ఏకంగా ఇలయతలపతి విజయ్‌తో బీస్ట్ సినిమాను తెరకెక్కించే ఛాన్స్ కొట్టేశాడు. ఈ సినిమాపై తమిళనాట భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఏప్రిల్ 14న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ క్రమంలో తన తదుపరి చిత్రంపై ఫోకస్ చేశాడు నెల్సన్ కుమార్. ఈ సినిమాను రజినీతో చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయి. మరి నెల్సన్ కుమార్ అయినా తలైవాకు బ్లాక్‌బస్టర్ ఇస్తాడో లేదో చూడాలి మరి.