గతేడాది జాతీయ పురస్కారం దక్కించుకున్న మరాఠీ సినిమా ‘లతా భగవాన్ కరే’ సినిమాను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీలో రూపొందిస్తున్నట్లు తెలిపారు దర్శకుడు నవీన్ దేశబోయిన, నిర్మాత ఎర్రబోతు కృష్ణ. తన భర్త భగవాన్ కరే వైద్య ఖర్చుల కోసం 65 ఏళ్ల వయసులో మారథాన్ పోటీల్లో పాల్గొన్న మహిళ లతా కరే నిజ జీవిత కథతో ఈ సినిమాను తెరకెక్కించారు.
లతా కరే సాహసం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. తాజాగా ఈ చిత్ర రూపకల్పన వివరాలను చిత్రబృందం హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో వెల్లడించారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు నవీన్ దేశబోయిన మాట్లాడుతూ..‘లతా భగవాన్ కరే జీవితంలో జరిగిన కథతో తెరకెక్కించిన చిత్రమిది. మహారాష్ట్ర ప్రభుత్వం ఈ సినిమా కథను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని నిర్ణయించింది. జాతీయ పురస్కారాల్లో మా చిత్రానికి పురస్కారం రావడం ప్రోత్సాహాన్నిచ్చింది. ఇప్పుడు ఇదే సినిమాను వివిధ భాషల్లో పాన్ ఇండియా మూవీగా రూపొందిస్తున్నాం’ అన్నారు.