రామగిరి, నవంబర్ 12 : జాతిని ఏకీకృతం చేయడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ పాత్ర మరువలేనిదని, ప్రజల్లో జాతీయ సమైక్యత, దేశభక్తిని పెంపొందించాలని రాజ్యసభ ఎంపీ కేశ్రీదేవ్ సిన్హ్ ఝాలా అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మై భారత్, ఎన్ఎస్ఎస్ సహకారంతో బుధవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎన్. జి.కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన “సర్దార్ @150 యూనిట్ మార్చ్” ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా పటేల్ చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. సర్దార్ వల్లభాయ్ పటేల్ స్ఫూర్తితో జాతి నిర్మాణంలో యువతను ప్రోత్సహించడం, యువత ఆలోచనలను ఆచరణలో పెట్టి దేశ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా యూనిట్ మార్చ్ కు హాజరైన అధికారులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రమాణం చేశారు. ఈ యూనిట్ మార్చ్ నాగార్జున డిగ్రీ కళాశాల నుండి బయల్దేరి గడియారం సెంటర్, ప్రతీక్ మెమోరియల్ ప్రభుత్వ జూనియర్ కాలేజీ వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ నారాయణ అమిత్. ఆర్డీఓ వై.అశోక్ రెడ్డి, డీఎస్పీ శివరాం రెడ్డి, జిల్లా క్రీడల యువజన శాఖ అధికారి అక్బర్ అలీ, మై భారత్ స్టేట్ సభ్యులు అనుస్మాన్, ప్రసాద్ దాస్, యూత్ కో-ఆర్డినేటర్ రాజేశ్, సాయి కృష్ణ పాల్గొన్నారు.

Ramagiri : జాతీయ సమైక్యత, దేశభక్తిని పెంపొందించాలి : ఎంపీ కేశ్రీదేవ్ సిన్హ్ ఝాలా