అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) ఇప్పటి వరకు అంతరిక్షానికి సంబంధించిన ఎన్నో అద్భుతమైన ఫొటోలు షేర్ చేసింది. తాజాగా ఈ సంస్థకు చెందిన స్ట్రాటోస్ఫేరిక్ అబ్జర్వేటరి ఫర్ ఇన్ఫ్రారెడ్ ఆస్ట్రానమీ (సోఫియా) ఎయిర్క్రాప్ట్ తన ఆఖరి జర్నీ పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా సోఫియా తీసిన అద్భుతమైన చిత్రాలను నాసా తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది.
బోయింగ్ 747 విమానానికి రకరకాల మార్పులు చేసి దీనికి అతిపెద్ద టెలిస్కోప్ అమర్చి, సోఫియాను 2010లో నాసా సిద్ధం చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 921 సార్లు గగనతలంలో చక్కర్లు కొట్టిన సోఫియా ఎన్నో చూపుతిప్పుకోనివ్వని ఫొటోలు క్లిక్ మనిపించింది.
వీటిలో కొన్నింటిని ఇన్స్టాగ్రాంలో షేర్ చేసిన నాసా.. ‘అంతరిక్షంలో ఎన్నో ఊపిరి తీసుకోవడం కూడా మర్చిపోయేంతటి అద్భుతమైన అందాలను.. 41 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తూ చీకట్లో, తెల్లవారుజాము తొలి వెలుగుల్లో ఆకాశంలో తిరుగుతూ సోఫియా తన కెమెరాలో బంధించింది’ అని పేర్కొంది.