మీకు అంతరిక్ష విషయాలపై ఆసక్తి ఉందా? ఉన్నట్టుండి పరిశోధకుల్లా మారిపోవాలనుందా? అయితే, అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా మీలాంటి వాళ్లకోసమే ఓ చాన్స్ ఇచ్చింది. అంగారక గ్రహంపై మేఘాలను గుర్తించేందుకు తమతో కలిసి పనిచేయాలని ప్రజలను ఆహ్వానించింది. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ట్యుటోరియల్ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.
తమ ప్రాజెక్ట్ ‘క్లౌడ్ స్పాటింగ్ ఆన్ మార్స్’లో భాగంగా అంగారక గ్రహంపై వాతావరణాన్ని అర్థం చేసుకోవడంలో ప్రతి ఒక్కరి సహాయాన్ని నాసా కోరుతోంది. ఈ సమాచారం అంగారక గ్రహంపై వాతావరణం మన భూమికంటే ఎందుకు ఒక శాతం మందంగా ఉందో తెలుసుకునేందుకు ఉపయోగపడుతుందని నాసా భావిస్తోంది.
అంగారక గ్రహంపై 2006 నుంచి అధ్యయనం చేస్తున్న మార్స్ రికనైసెన్స్ ఆర్బిటార్ 16 ఏళ్ల డేటాను ఉపయోగించుకొని ఈ అధ్యయనం కొనసాగుతుంది. ఈ స్పేస్‌క్రాఫ్ట్ మార్స్ క్లైమేట్ సౌండర్.. ఇన్ఫ్రారెడ్ లైట్లో వాతావరణాన్ని అధ్యయనం చేస్తుంది. ఇది కంటికి కనిపించదు. ఈ స్పేస్ క్రాఫ్ట్ అంగారక గ్రహం చుట్టూ తిరుగుతున్నప్పుడు పరికరం తీసుకున్న కొలతలలో మేఘాలు తోరణాల్లాగా కనిపిస్తాయి. ఆ డేటాను జల్లెడ పట్టడం, ఆర్చ్‌లను గుర్తించడం ద్వారా శాస్త్రవేత్తలు మార్స్‌పై వాతావరణాన్ని అంచనావేస్తారు. వీటిని గుర్తించేందుకు నాసా ప్రజల సహాయం కోరుతోంది.