e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 16, 2021
Home News ఆరోగ్యమస్తు

ఆరోగ్యమస్తు

ఆరోగ్యమస్తు

గద్వాల దవాఖానలో తెలంగాణ డయాగ్నోస్టిక్‌ హబ్‌ ఏర్పాటు
ఉచితంగా రోగనిర్ధారణ పరీక్షలు
పీహెచ్‌సీల నుంచి రక్తనమూనాలు
టెస్ట్‌ల అనంతరం ఆన్‌లైన్‌లో రిపోర్ట్

గద్వాల, మార్చి 26 : నేను రాను బిడ్డో సర్కార్‌ దవాఖానకు అనే రోజులు మారిపోయాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత టీఆర్‌ఎస్‌ అధికారంలోకి రావడంతో వైద్య రంగంలో సమూల మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం పల్లె జనంతోపాటు పట్టణ ప్రజలు కూడా తమకు సర్కార్‌ దవాఖానల వైపు పరుగులు తీస్తున్నారు. ప్రభుత్వ దవాఖానల్లో కార్పొరేట్‌ స్థాయిలో వైద్య పరీక్షలు అందుతున్నాయి. దీంతో జోగుళాంబ గద్వాల జిల్లా దవాఖానలో ఓపీ సంఖ్య సుమారు 600 వరకు ఉంటున్నది. తలనొప్పి వచ్చిందని ప్రైవేట్‌ దవాఖానకు వెళ్తే అవసరానికి మించి పరీక్షలు చేసి డబ్బులు దోచుకునేవారు. జ్వరం వస్తే కనీసం రూ.వెయ్యి.., కడుపునొప్పి వస్తే స్కానింగ్‌ చేసి రూ.8వేల వరకు బిల్లు వేసేవారు. దీంతో ఆర్థిక స్థోమత లేక సామాన్య ప్రజలు ప్రాణాల మీదికి తెచ్చుకునేవారు.ఈ దుర్భర పరిస్థితి నుంచి ప్రజలను రక్షించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ దవాఖానల్లో తెలంగాణ డయాగ్నోస్టిక్‌ హబ్‌ను ఏర్పాటు చేసి ఉచిత రోగనిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. ఇందులో భాగంగా జోగుళాంబ గద్వాల జిల్లా దవాఖానలో డయాగ్నోస్టిక్‌ హబ్‌ ఏర్పాటు చేశారు. ప్రజల ఆరోగ్యం కోసం దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రజలకు పైసా ఖర్చు లేకుండా వివిధ రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు.
రెండు నెలలుగా డ్రైరన్‌..
డయాగ్నోస్టిక్‌ హబ్‌కు సంబంధించి జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖాన ఆవరణలో నూతన భవనాన్ని నిర్మించారు. అన్ని రకాల పరీక్షలకు సంబంధించిన పరికరాలను అమర్చి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే, ప్రభుత్వ ఆదేశంతో రెండు నెలలుగా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు డ్రైరన్‌ నిర్వహిస్తున్నారు. జిల్లాలోని 12 మండలాల్లోని పీహెచ్‌సీల నుంచి రెండు వాహనాల్లో ప్రతి రోజూ సుమారు 850 రక్త నమూనాలు సేకరిస్తున్నారు. మలేరియా, టైఫాయిడ్‌, డెంగీ, డీఆర్‌ఎల్‌, హెమటాలజీ, బ్లడ్‌గ్రూపింగ్‌, ప్లేట్‌లెట్స్‌, హర్మోన్‌స్టడీస్‌, మైనర్‌ సర్జికల్‌ ప్రొఫైల్‌, హెచ్‌ఐవీ, హెచ్‌బీఎస్‌ఐజీ, విటమిన్‌ బీ-12, డీ విటమిన్‌, షుగర్‌, కిడ్నీ, లివర్‌ సంబంధిత వ్యాధులకు థైరాయిడ్‌, ఫీవర్‌, టీబీ, కాల్షియం వంటి వాటికి సంబంధించిన రక్తం శాంపిల్స్‌ సేకరిస్తున్నారు. ల్యాబ్‌లో టెస్ట్‌ చేసిన అనంతరం వారికి సంబంధించిన రిపోర్టు ఆన్‌లైన్‌లో తీసుకునేలా ఏర్పాట్లు చేశారు. దీంతోపాటు ల్యాబ్‌లో పరీక్షలు చేయించుకున్న రోగులకు సంబంధించిన సమాచారం వారి సెల్‌ఫోన్‌కు పంపిస్తున్నారు. అలాగే ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్‌ పరీక్షలతోపాటు రక్తం, మూత్రం, కొలెస్ట్రాల్‌, చక్కెరస్థాయి తదితర పరీక్షలు కూడా చేస్తున్నారు. ఇలాంటి పరీక్ష కేంద్రాలను మొదటగా హైదరాబాద్‌లోని నారాయణగూడలో ప్రారంభించారు. సత్ఫలితాలు ఇవ్వడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దవాఖానల్లో ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఇందులో భాగంగా జోగుళాంబ గద్వాల జిల్లాలో డయాగ్నోస్టిక్‌ హబ్‌ ఏర్పాటు చేశారు. ఇది ప్రస్తుతం అందుబాటులోకి రావడంతో పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, జిల్లా, ఏరియా దవాఖానలను అనుసంధానం చేసి అక్కడి నుంచి రక్త నమూనాలు సేకరిస్తున్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలు తమకు దగ్గర్లో ఉన్న ప్రభుత్వ దవాఖానల్లో వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటే.. శాంపిళ్లను డయాగ్నోస్టిక్‌ హబ్‌కు పంపి సత్వరమే ఫలితాలు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో పరీక్షల కోసం పల్లెప్రజలు పట్టణాలకు వచ్చే శ్రమ తగ్గింది. డబ్బులు చెల్లించి పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. డయాగ్నోస్టిక్‌ హబ్‌లో పూర్తి స్థాయిలో అత్యాధునిక పరికరాలు అందుబాటులో ఉంచారు. భవనంతోపాటు పరికరాల కోసం రూ.3.50 కోట్లు ఖర్చు చేశారు. ఏదేమైనా ప్రజల ఆరోగ్య పరిరక్షణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో నిరుపేదలకు మేలు కలుగుతున్నది.
అందుబాటులో ఆధునిక పరికరాలు..
తెలంగాణ డయాగ్నోస్టిక్‌ ల్యాబ్‌లో ఆధునిక పరికరా లు అందుబాటులో ఉన్నాయి. థైరాయిడ్‌ పరీక్ష కోసం ఏర్పాటు చేసిన మి షన్‌లో ఒకే సారి 60 శాంపిళ్లకు పరీక్షలు చేస్తున్నారు. సీబీపీ (కంప్లీట్‌ బ్లెడ్‌ పిచ్చర్‌) రక్తకణాల గుర్తింపు మిషన్‌లో ఒకే సారి 120 శాంపిళ్లకు, బయోకెమిస్ట్రీ పరికరంలో ఒకేసారి 400 శాంపిళ్లకు పరీక్షలు చేసే అవకాశం ఉన్నది. ల్యాబ్‌లో మొత్తం ఎనిమిది మంది సిబ్బంది పని చేస్తున్నారు. డిజిటల్‌ ఎక్స్‌రే అందుబాటులోకి వస్తే 57 రకాల పరీక్షలు ఇక్కడే చేయనున్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఆరోగ్యమస్తు

ట్రెండింగ్‌

Advertisement