e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 19, 2021
Home News ముహూర్తం 30కే

ముహూర్తం 30కే

ముహూర్తం 30కే

నల్లగొండ ప్రతినిధి, మార్చి 26 (నమస్తే తెలంగాణ) : నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికల నామినేషన్ల దాఖలుకు ఒక్కరోజు మాత్రమే గడువు మిగిలింది. వాస్తవానికి ఈ నెల 30 చివరి తేదీ కాగా.. శని, ఆది, సోమవారాలు వరుసగా ప్రభుత్వ సెలవులు వచ్చాయి. ఇప్పటివరకు 20 మంది అభ్యర్థులు 23 సెట్లు నామినేషన్లు దాఖలు చేయగా.. ప్రధాన పార్టీలతోపాటు మిగిలిన అభ్యర్థులకూ చివరి రోజైన మంగళవారం మాత్రమే అవకాశం ఉంది. దాంతో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ తమ అభ్యర్థులతో మంగళవారం నామినేషన్‌ వేయించేందుకు సిద్ధమవుతున్నాయి. ఆ రోజు రిట్నరింగ్‌ ఆఫీసర్‌ కార్యాలయం ఉన్న నిడమనూరులో ఆయా పార్టీల నేతలు, కార్యకర్తలతో కోలాహలం నెలకొననున్నది. కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఇప్పటికే జానారెడ్డి పేరు ఖరారు కాగా.. టీఆర్‌ఎస్‌, బీజేపీ తమ అభ్యర్థులను నేడో, రేపో ప్రకటించనున్నాయి. మరోవైపు బీజేపీ టికెట్‌ రేసులో ఆ పార్టీల నేతల మధ్య లొల్లి తారాస్థాయికి చేరింది. అభ్యర్థి ఎవరనేది అధిష్ఠానం అధికారికంగా ప్రకటించకపోయినా ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్‌రెడ్డి సతీమణి నివేదితరెడ్డి శుక్రవారం తన నామినేషన్‌ దాఖలు చేశారు. తనకే టికెట్‌ వస్తుందన్న నమ్మకంతోనే నామినేషన్‌ వేసినట్లు ఆమె పేర్కొంటుండగా, మరో వర్గం నేతలు గుర్రుగా ఉన్నారు.


శాసనమండలి ఎన్నికలు ముగిశాక ఇప్పడు అందరి దృష్టి నాగార్జున సాగర్‌ ఉపఎన్నికపైనే పడింది. నోటిఫికేషన్‌ వెలువడిన అనంతరం నామినేషన్ల కోలాహలం కొనసాగుతుంది. ఈ నెల 23నుంచి నిడుమనూరు తాసీల్దార్‌ కార్యాలయంలో నామినేషన్లను స్వీకరిస్తున్నారు. తొలిరోజు ఐదుగురు, రెండో రోజు ఇద్దరు, మూడో రోజు ఆరుగురు నామినేషన్లు దాఖలు చేశారు. నాల్గో రోజు శుక్రవారం మొత్తం 10మంది నామినేషన్లను దాఖలు చేశారు. ఇందులో బీజేపీ అభ్యర్థిగా కంకణాల నివేదిత, టీడీపీ అభ్యర్థిగా మువ్వ అరుణ్‌కుమార్‌, మరో 8మంది నామినేషన్లను ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి రోహిత్‌సింగ్‌కు అందించారు. దీంతో మొత్తం నామినేషన్లు దాఖలు చేసిన వారి సంఖ్య 23కి చేరింది. ఇక మిగిలి ఉన్న ఒక్కరోజే ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు ఇతరులెవరైనా నామినేషన్లు వేసేందుకు అవకాశం ఉంది. దీంతో ఆఖరి రోజైన మంగళవారం భారీఎత్తున నామినేషన్లు దాఖలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. టీఆర్‌ఎస్‌ అభ్యర్థిపై ఇప్పటికే ఓ అంచనాకు వచ్చిన పార్టీ అధినేత కేసీఆర్‌ నేడోరేపో ప్రకటించవచ్చని పార్టీవర్గాల ద్వారా తెలిసింది. అభ్యర్థి ఎవరైనా గెలుపే లక్ష్యంగా ఇప్పటికే పార్టీ శ్రేణులన్నీ ప్రచారరంగంలో దూసుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం నామినేషన్‌ సందర్భంగా పెద్దఎత్తున పార్టీ ముఖ్యులు, శ్రేణులు తరలిరావచ్చని అంచనా వేస్తున్నారు. ఇక కాంగ్రెస్‌ నుంచి సీనియర్‌ నేత జానారెడ్డినే మరోసారి ఆ పార్టీ రంగంలోకి దింపింది. ఈ నెల 30న నామినేషన్‌ వేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. మరోవైపు బీజేపీ కూడా తన అభ్యర్థిపై ఇంకా స్పష్టత ఇవ్వలేదు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎన్నికల సమన్వయకర్త సంకినేని వెంకటేశ్వర్‌రావు శుక్రవారం సాయంత్రం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆశావహులతో విడివిడిగా సమావేశమైనట్లు తెలిసింది. నివేదితారెడ్డి, కడారి అంజయ్యయాదవ్‌, ఇంద్రసేనారెడ్డి, రవినాయక్‌ తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నారు.
ఆఖరిరోజు కోలాహలం..
నామినేషన్లకు చివరి రోజైన 30వ తేదీ మంగళవారం భారీ కోలాహలం నెలకొనే అవకాశాలు ఉన్నాయి. అదేరోజు ప్రధాన పార్టీలైన టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు నాలుగు గంటలు మాత్రమే సమయం ఉంటుంది. ఈ సమయంలోపే నామినేషన్లు దాఖలు చేయాలనుకునే వారు ఆర్వో కార్యాలయ ఆవరణలోకి వచ్చి ఉండాల్సి ఉంటుంది. అయితే ప్రధాన పార్టీల నామినేషన్ల సందర్భంగా భారీ ఎత్తున నేతలు, కార్యకర్తలు తరలివచ్చే అవకాశం ఉంది. దీంతో విడతల వారీగా అభ్యర్థులకు సమయం కేటాయించనున్నారు. ఆ ప్రకారమే తమ నామినేషన్లను దాఖలు చేయాల్సి ఉంటుంది. ఇక ఇదే సమయంలో ఎవరైనా సభలు, సమావేశాలు నిర్వహించాలనుకుంటే ముందస్తు అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి కూడా ప్రత్యేకంగా స్థలం, సమయాన్ని అధికారులే నిర్ణయించనున్నారు. ఆఖరి రోజు భారీగా నామినేషన్లు ఉండనున్న నేపథ్యంలో భారీ పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది.
బీజేపీలో టికెట్టు లొల్లి…
నియోజకవర్గంలో నామమాత్రంగానే ఉన్న బీజేపీలో టికెట్టు లొల్లి తారాస్థాయికి చేరుకుంది. జిల్లా ముఖ్య నేతలు రెండు వర్గాలుగా విడిపోయి ఎవరి ప్రయత్నాల్లో వారు మునిగితేలుతున్నారు. గత ఎన్నికల్లో ప్రస్తుత జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్‌రెడ్డి భార్య నివేదితారెడ్డి పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. కేవలం 2,675 ఓట్లతో నాల్గవ స్థానంలో నిలిచి డిపాజిట్‌ కూడా కోల్పోయారు. అయితే మరోసారి తమకే అవకాశం కల్పించాలంటూ పార్టీ నేతలను డిమాండ్‌ చేస్తున్నారు. బీసీ సామాజిక కోణంలో ఇటీవలే టీడీపీ నుంచి బీజేపీలో చేరిన కడారి అంజయ్యయాదవ్‌కు టికెట్‌ ఇవ్వాలని మరోవర్గం ప్రయత్నిస్తున్నది. రిక్కల ఇంద్రసేనారెడ్డి, డాక్టర్‌ రవినాయక్‌ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నలుగురు నేతలు హైదరాబాద్‌లో రాష్ట్ర నేతల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. ఇదిలా ఉండగానే నివేదిత శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేశారు. బీజేపీ అభ్యర్థిగానే ఆర్వో రోహిత్‌సింగ్‌కు అందించారు. అయితే టికెట్‌ తనకు రాకపోయినా నివేదిత పోటీలో ఉంటారా? ఫైనల్‌గా ఏం జరుగవచ్చన్న అంశాలపై ఆ పార్టీలో ఆసక్తికరమైన చర్చ జరుగుతున్నది.
20 మంది అభ్యర్థులు.. 23 నామినేషన్లు
నిడమనూరు, మార్చి 26 : నాగార్జునసాగర్‌ శాసనసభ స్థానానికి దాఖలు చేసిన నామినేషన్ల సంఖ్య 23కు చేరింది. శుక్రవారం పది మంది 12నామినేషన్లు దాఖలు చేశారు. రంగారెడ్డి జిల్లా చంద్ర ధన గ్రామానికి చెందిన వడ్ల శ్యామ్‌ (అన్నా వైఎస్సార్‌ పార్టీ), పెద్దవూర మండలం పోతునూరుకు చెందిన వడ్లపల్లి రామకృష్ణారెడ్డి (సమాజ్‌వాదీ ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ), అనుముల మండలం చింతగూడేనికి చెందిన మువ్వా అరుణ్‌కుమార్‌ (తెలుగుదేశం పార్టీ), నాగార్జునసాగర్‌ విజయపురి కాలనీకి చెందిన కండెల శంకరయ్య (బహుజన ముక్తి పార్టీ), పెద్దవూర మండలం పులిచర్ల గ్రామానికి చెందిన కంకణాల నివేదిత (భారతీయ జనతా పార్టీ), అనుముల మండలం చెల్మారెడ్డిగూడేనికి చెందిన ముదిగొండ్ల వెంకటయ్య (మహాజన సోషలిస్టు పార్టీ), స్వతంత్ర అభ్యర్థులు నిడమనూరు మండలం శాఖాపురం గ్రామానికి చెందిన తగుళ్ల నరేశ్‌, అనుముల మండలం ఇబ్రహీంపేటకు చెందిన తలారి రాంబాబు, త్రిపురారం మండలం లచ్యాతండాకు చెందిన పానుగోతు లాలాసింగ్‌, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా లక్ష్మీనగర్‌కు చెందిన కౌటం రవీందర్‌ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి బి.రోహిత్‌ సింగ్‌కు నామినేషన్‌ పత్రాలు సమర్పించారు. వీరిలో వడ్ల శ్యామ్‌, తలారి రాంబాబు రెండో సెట్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. ఇప్పటి వరకు 20 మంది అభ్యర్థులు 23నామినేషన్లు వేసినట్లు అధికారులు తెలిపారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ముహూర్తం 30కే

ట్రెండింగ్‌

Advertisement