రోజురోజుకూ పెరుగుతున్న కేసులు
ఎక్కువ మంది నడి వయస్సు వారే..
జాగ్రత్తలు తప్పనిసరంటున్న వైద్యులు
కొవిడ్ టీకా వేయించుకుని
స్ఫూర్తిని చాటిన ఎంపీ బడుగుల
నీలగిరి, మార్చి 24 : కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది, టీకా కూడా వచ్చింది.. ఇక డోకా లేదని ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో వైరస్ మళ్లీ విజృంభిస్తుండడం ఆందోళనకు గురిచేస్తున్నది. ఉమ్మడి జిల్లాలో రెండు నెలల నుంచి కేసుల తీవ్రత అంతగా లేకపోగా, పది రోజులుగా పెరుగుతూ వస్తున్నాయి. పాజిటివ్ కేసుల్లో 20 నుంచి 50 ఏండ్ల వారే ఎక్కువగా ఉంటున్నారు. రిపోర్ట్ పాజిటివ్ వచ్చిన వాళ్లు, లక్షణాలు ఉన్నవాళ్లు హోమ్ ఐసోలేట్ అవ్వాలని వైద్యారోగ్యశాఖ అధికారులు కోరుతున్నారు. రద్దీ ప్రాంతాల్లో భౌతిక దూరం పాటించాలని, మాస్కులు విధిగా పెట్టుకోవాలని సూచిస్తున్నారు. నల్లగొండ జిల్లాలో రెండు నెలలుగా ప్రజలకు కరోనా టీకాలు వేస్తున్న విషయం తెలిసిందే. ఈ నెలలో జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య తక్కువగా నమోదయ్యాయి. నాలుగు పాఠశాలల్లో నలుగురు విద్యార్థులకు, హైదరాబాద్‌లోని హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న మరో ఏడుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. జిల్లాలో మొత్తం 298 కేసులు యాక్టివ్‌లో ఉండగా అందులో ఎక్కువగా 20 నుంచి 50 సంవత్సరాలలోపు వారే ఉన్నారు. వీరంతా హోమ్ ఐసోలేషన్‌లో ఉండి వైద్యారోగ్యశాఖ అధికారుల సూచనలు పాటిస్తూ వేగంగా కోలుకుంటున్నారు.
జిల్లాలో విస్తృతంగా పరీక్షలు…
కొంతకాలంగా జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో కరోనా పరీక్షలు పెంచారు. విస్తృతంగా ర్యాపిడ్ యాంటిజెన్ డయాగ్నస్టిక్ పరీక్షలతోపాటు జిల్లా కేంద్ర దవాఖానలో ఆర్టీపీసీఆర్ విధానంలోనూ పరీక్షలు నిర్వస్తున్నారు. ఇప్పటివరకు 3,20,120 మందికి పరీక్షలు నిర్వహించారు. అందులో 22,875మందికి పాజిటివ్ వచ్చింది. వారిలో 74మంది మృత్యువాత పడగా ప్రస్తుతం 298యాక్టివ్ కేసులు ఉన్నాయి. 22,503మంది డిశ్చార్జ్ అయ్యారు. ఐసీఎంఆర్ బృందాలు కూడా జిల్లాలో ప్రత్యేక గ్రామాలను ఎంపిక చేసి పరీక్షలు నిర్వహించారు.
పదిరోజుల్లో అత్యధిక పాజిటివ్ కేసులు..
జిల్లాలో కేవలం పది రోజుల్లో 262పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ నెల 13వ తేదీన 24, 14న 7, 15న 30, 16న 27, 17న 21, 18న 18, 19న 12, 20న 43, 21న 10, 22న 30, 23న 40 కేసులు నమోదయ్యాయి. జిల్లాలో కరోనా కేసుల విషయంలో 98.58శాతం రికవరీ రేటు ఉండగా మరణాలు 0.32 శాతం, కోలుకుంటున్న వారు 1.10శాతం మంది ఉన్నారు. అదేవిధంగా సూర్యాపేట జిల్లాలో 14వ తేదీన 4, 15న 14, 16న 5, 17న 7, 18న 13, 19న 31, 20న 16, 21న 5, 22న 23, 23న 24 కేసులు మొత్తం పది రోజుల్లోనే 142 కేసులు నమోదయ్యాయి.