ఓ సినిమాను ఎలా ప్రమోట్ చేసుకోవాలో నాగార్జునకు తెలిసినంతగా మరెవరికి తెలియదేమో..? ఎందుకంటే ఈయన కేవలం హీరో మాత్రమే కాదు నిర్మాత కూడా. అందుకే ఆయన చేసే సినిమాలకు ప్రమోషన్ కూడా అలాగే ప్లాన్ చేస్తుంటాడు నాగార్జున. ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నాడు మన్మథుడు. తాజాగా ఈయన నటించిన వైల్డ్ డాగ్ సినిమా ఎప్రిల్ 2న విడుదల కానుంది. అహిషోర్ సోలోమెన్ ఈ సినిమాను తెరకెక్కించాడు. పక్కా యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాపై ముందు ఎవరికీ పెద్దగా అంచనాల్లేవు. కరోనా సమయంలోనే షూటింగ్ పూర్తి చేసుకున్న వైల్డ్ డాగ్ సినిమాను నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేయాలని ముందుగానే డీల్ కూడా ముగించేసారు. అదే సమయంలో థియేటర్స్ ఓపెన్ చేసారు.
దాంతో డీల్ క్యాన్సిల్ చేసుకుని ఇప్పుడు థియేటర్స్ లో సినిమాను విడుదల చేస్తున్నారు. ఇదిలా ఉంటే ట్రైలర్ విడుదలయ్యే వరకు కూడా వైల్డ్ డాగ్ సినిమాపై అంచనాలు లేవు.. ఆసక్తి కూడా లేదు. కానీ ఇప్పుడు ఈ సినిమాపై ఆసక్తి పెరిగిపోతుంది. అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. దానికి కారణం ప్రమోషన్స్.. నాగార్జున తన టీంతో కలిసి ప్రమోషన్స్ చేస్తున్నాడు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అన్ని ఛానెల్స్ కు కూడా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. అంతేకాదు సోషల్ మీడియాలో అభిమానులతో కలుస్తున్నాడు. వాళ్లు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్తున్నాడు. ఎప్పటికప్పుడు కొత్త ప్రోమోలను విడుదల చేస్తున్నాడు.
తాజాగా విడుదలైన రిలీజ్ ట్రైలర్ కూడా సినిమాపై అంచనాలు పెంచేసింది. టెర్రరిజం బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ చిత్రంలో నాగార్జున NIA ఏజెంట్ గా నటిస్తున్నాడు. ఈయనకు డిపార్ట్ మెంట్ లో ముద్దుగా వైల్డ్ డాగ్ అని పిలుస్తారు. ఏదైనా ఆపరేషన్ మొదలు పెట్టాడంటే వెనక్కి తిరిగి చూసుకునే అలవాటు లేని సిన్సియర్ ఆఫీసర్ గా నటించాడు నాగ్. ఈ విజువల్స్.. టీజర్స్ చూసిన తర్వాత సినిమాపై ఆసక్తి పెరిగిపోతుంది. ఇదే రేంజ్ లో ప్రమోషన్స్ ఇంకా పెంచేస్తే కచ్చితంగా సినిమాకు మంచి ఓపెనింగ్స్ రావడం ఖాయంగా కనిపిస్తుంది.