కథాంశాల ఎంపికలో కొత్తదనానికి పెద్దపీట వేస్తారు యువహీరో నాగశౌర్య. వాణిజ్య పంథాలోనే వైవిధ్యమైన సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘వరుడు కావలెను’. లక్ష్మీసౌజన్య దర్శకురాలు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నాగవంశీ నిర్మించారు. నేడు ప్రేక్షకులముందుకు రానుంది. ఈ సందర్భంగా గురువారం నాగశౌర్య పాత్రికేయులతో సంభాషించారు. ఆ విశేషాలివి..
మూడేళ్లక్రితం ‘ఛలో’ సక్సెస్ పార్టీ సందర్భంలో దర్శకురాలు లక్ష్మీసౌజన్య ఈ సినిమా సబ్జెక్ట్ చెప్పింది. అప్పటి నుంచి ఈ కథతో ప్రయాణం సాగిస్తున్నా. ప్రతి ఇంట్లో జరిగే కథ ఇది. ముప్పైఏళ్లు దాటిన ప్రతి అబ్బాయి అమ్మాయికి పెళ్లెప్పుడనే ప్రశ్న ఎదురవుతుంటుంది. వారి అభిప్రాయాలతో సంబంధం లేకుండా పెళ్లి ప్రస్తావన తీసుకొస్తుంటారు. ఈ పాయింట్ మీదే కథ నడుస్తుంది. పరిణతి చెందిన ప్రేమకథగా ఆకట్టుకుంటుంది. ప్రేమ నుంచి పెళ్లిపీటల వరకు ఓ జంట చేసే ప్రయాణానికి అందమైన దృశ్యరూపంలా ఉంటుంది. పెద్దల అంగీకారం లభించేంత వరకు నిరీక్షించే జంట కథగా అలరిస్తుంది. ఈ సినిమా కథతో నేను కూడా వ్యక్తిగతంగా చాలా వరకు కనెక్ట్ అయ్యాను.
బ్లాక్‌బస్టర్ హిట్ ఖాయం
ఈ సినిమా కోసం త్రివిక్రమ్‌గారు ఓ సీన్ రాశారు. అందులో నేను నటించడం గొప్ప అనుభూతినిచ్చింది. ముఖ్యంగా ఆయన రాసిన సంభాషణలు పలకడం ఎప్పటికీ మర్చిపోలేను. ఈ సినిమా ద్వితీయార్థంలో అర్ధగంట పాటు వచ్చే ఒక ఎపిసోడ్ కథకు ఆయువుపట్టుగా నిలుస్తుంది. ఇక వ్యక్తిగతం నాకు పెళ్లి మీద నిర్దిష్టమైన అభిప్రాయాలంటూ ఏమీ లేవు. మనం ఎంతగా ఆలోచించినా ఏది జరగాలో అదే జరుగుతుంది. పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి వ్యక్తిగత స్వేచ్ఛకు నేను పూర్తిగా విలువనిస్తా. కెరీర్‌పరంగా ఆమె తీసుకునే నిర్ణయాలకు బాసటగా నిలుస్తా. ఈ సినిమా ఫైనల్ అవుట్‌పుట్ చూసిన తర్వాత బ్లాక్‌బస్టర్ హిట్ ఖాయమనిపించింది.
ఒక్కో మెట్టెక్కుతున్నా..
నా కెరీర్ విషయంలో పూర్తి సంతృప్తిగా ఉన్నా. ప్రతి హీరోకు విజయాల కంటే ఎక్కువగా ఫ్లాప్లే ఉంటాయి. అందరూ అంగీకరించాల్సిన సత్యమిది. ఐదు పెద్ద హిట్స్ సాధించినవారు స్టార్‌డమ్‌ను సంపాదించుకుంటారు. ‘ఛలో’ సినిమాతో నాకు భారీ విజయం దక్కింది. నేను పెద్ద హీరో అనిపించుకోవడానికి ఇంకో నాలుగు హిట్స్ కావాలి. ఒక్కరోజులోనే పైకి ఎదగడం కంటే ఒక్కో మెట్టు ఎక్కుతూ కెరీర్‌ను తీర్చిదిద్దుకోవాలన్నదే నా సిద్ధాంతం. మహిళా దర్శకులతో సినిమాలు చేయడం వల్ల కొన్ని సానుకూలాంశాలుంటాయి. వాళ్లకు ఓర్పు, సహనం ఎక్కువ. ఎదుటివాళ్ల మాటకు విలువనిస్తారు. దాంతో అన్ని పనులు అనుకున్న విధంగా జరుగుతాయి.
గుర్తుండిపోయే సినిమా అవుతుంది
అవసరాల శ్రీనివాస్‌తో చేస్తున్న ‘ఫలానా అమ్మాయి ఫలానా అబ్బాయి’ నా డ్రీమ్ ప్రాజెక్ట్. ఈ సినిమా మొదలుపెట్టి నాలుగేళ్లవుతుంది. ఇందులో నేను ఏడు రకాలుగా కనిపిస్తా. నా కెరీర్లోనే గుర్తుండిపోయే సినిమా అవుతుంది. కథాంశాల ఎంపికలో సొంతంగా నిర్ణయాలు తీసుకుంటా. కమర్షియల్ పంథాలోనే కొత్తదనం ఉన్న కథల్ని ఎంచుకొని కెరీర్లో సాగిపోతున్నా.