ఆంధ్రప్రదేశ్‌లో సినిమా వీక్షించాలనుకునే వారు ఇక ఇంటి వద్ద నుంచే సినిమా టికెట్లను ఆన్లైన్లో కొనుగోలు చేసుకునే వెసులుబాటును కల్పించబోతుంది అక్కడి ప్రభుత్వం. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఆన్లైన్ టికెట్ల విక్రయాల కోసం సినిమాటోగ్రఫీ చట్టానికి సవరణ బిల్లును ఏపీ రాష్ట్ర మంత్రి పేర్ని నాని బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ ‘సినిమా థియేటర్లలో రోజుకు నాలుగు ఆటలు మాత్రమే వేయాల్సిన చోట నిబంధనలకు వ్యతిరేకంగా అంతకు మించి షోలు ప్రదర్శిస్తున్నారు. బెనిఫిట్ షోల పేరిట టికెట్‌కు రూ.1000 వరకు ప్రజల నుంచి వసూలు చేస్తున్నారు. ఏ చట్టం మమ్మల్ని ఆపలేదని కొందరు, ఏ చట్టమైనా తమకు అనుకూలంగా ఉండాలని ఇంకొందరు భావిస్తున్నారు. ఇక నుంచి ఈ ఆన్లైన్ టికెటింగ్ ద్వారా సినిమా హాళ్లలో జరుగుతున్న వ్యవహారాలకు అడ్డుకట్ట వేయెచ్చు. అంతేకాదు ప్రభుత్వం నిర్ధేశించిన సమయాల్లో మాత్రమే సినిమా షోలను వేయాలి. బస్సు, రైలు టికెట్లు ఇంటి వద్ద నుంచి ఎలా బుక్ చేసుకుంటారో సినిమా టికెట్లనూ ఆ తరహాలోనే ఆన్లైన్లో కొనుగోలు చేయెచ్చు’ అన్నారు. టికెట్ల రేట్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి చిన్న సినిమా, పెద్ద సినిమా అనే వ్యత్యాసం లేదని, ఆన్లైన్ టికెటింగ్ ద్వారా ప్రభుత్వానికి రావాల్సిన పన్నులు యథావిధిగా వస్తాయని, ఆన్లైన్ పోర్టల్‌ను ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిర్వహిస్తుందని, ఆర్బీఐ గేట్‌వే ద్వారా ఏ రోజు వసూళ్లు ఆ రోజు సినిమా హాళ్లకు డబ్బు చెల్లింపులు జరుగుతాయని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు.