సృష్టిలో అన్నిటికన్నా స్వచ్ఛమైన ప్రేమ తల్లి ప్రేమ అంటారు. ఈ మాటను నిరూపించే ఎన్నో సంఘటనలు మన కళ్లబడుతూనే ఉంటాయి. అవి జంతువులైనా, మనుషులైనా పిల్లలపై తల్లులకు ఉండే ప్రేమను ఎవరూ అంచనా వేయలేరు. ఇప్పుడు తాజాగా అలాంటి తల్లిప్రేమను చూపించే ఘటన నెట్టింట వైరల్ అవుతోంది.
బ్రెజిల్లో అవాయ్, ఫ్లెమింగో జట్ల మధ్య ఫుట్బాల్ మ్యాచ్ చూసేందుకు తల్లి క్రిస్టీనాతో కలిసి మార్కోస్ ఫిలిప్ వచ్చాడు. మార్కోస్కు కళ్లు కనిపించవు. అందుకే ఆ స్టేడియంలో ఉన్న ప్రతి చిన్న విషయాన్ని తన కుమారుడికి వివరించిందా తల్లి. మార్కోస్ చేతిని తన చేతుల్లోకి తీసుకొని, మైదానంలో ఒక వైపు చూపిస్తూ.. ‘‘అదిగో అక్కడ చాలా మంది అవాయ్ ఫ్యాన్స్ ఉన్నారు. ఇక్కడ ఫ్లెమింగో ఫ్యాన్స్ బాగా ఉన్నారు’’ అని వివరించింది.
దూరంగా చాలా జెండాలు ఉన్నాయని చెప్పి, మరో వైపు అతని చెయ్యి చూపిస్తూ.. మనం గోల్ వెనుక కూర్చున్నామని వివరించింది. ‘‘నీకు అర్థమవుతుందా? నాన్నా?’’ అని కుమారుడిని ప్రశ్నించింది. దీనికి సంబంధించిన వీడియోను స్థానిక వార్తా సంస్థలు ప్రముఖంగా ప్రచురించాయి. అలాగే ఒక ఇన్స్టాగ్రాం ఖాతాలో కూడా దీన్ని పోస్టు చేశారు. నెట్టింట ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. దీన్ని చూసిన వాళ్లంతా ఆ తల్లిప్రేమను మెచ్చుకుంటున్నారు.