బతుకమ్మకు అంతర్జాతీయ ఖ్యాతి!
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
ఖలీల్వాడి, అక్టోబర్ 13: బతుకమ్మ పండుగ విశిష్ఠతను ప్రపంచవ్యాప్తంగా తెలియజేసేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. బుధవారం నిజామాబాద్లో జరిగిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న సందర్భంగా ఆమె మాట్లాడారు. ఈ నెల 23న దుబాయ్లో బతుకమ్మ పండుగపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, దీనికి ఆస్కార్ అవార్డుగ్రహీత, ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ హాజరవుతున్నారని తెలిపారు. ఒకప్పుడు బతుకమ్మ పండుగ జరుపుకోవడానికి కోర్టుకు వెళ్లిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత ప్రభుత్వమే ఘనంగా పండుగను నిర్వహించడం ఆనందంగా ఉన్నదన్నారు. బతుకమ్మ పండుగను అధికారికంగా జరుపు కోవడం, బతుకమ్మ చీరలను పంపిణీ చేయడం, తంగేడు రాష్ట్ర పువ్వు కావడం వంటివన్నీ తెలంగాణ ఆడబిడ్డలకు దక్కిన గౌరవంగా భావిస్తున్నామని తెలిపారు. ఏఆర్ రహమాన్ రూపొందించిన పాట ద్వారా దేశవిదేశాల్లో మరోసారి బతుకమ్మ పండుగ ఖ్యాతి పెరిగిందన్నారు. ఈ వేడుకలో మహిళా కమిషన్ సభ్యురాలు సూదం లక్ష్మి, మేయర్ నీతూ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.