కోజికోడ్,జూన్ 29: రోజుకు కోడి ఎన్ని గుడ్లు పెడుతుంది…? మహా అంటే రెండు లేదంటే ఒకటి. ఈ కోడి మామూలు కోడి కాదు..ఏకంగా 11గుడ్లు పెట్టి అందరినీ ఆశ్చర్య పరిచింది. ఈ వండర్ కోడి వార్తల్లో నిలిచింది.
కేరళలో కోజికోడ్ జిల్లా బాలుస్సెరీ సమీపంలో ఉన్న కొలతూరులో ఈ విచిత్ర ఘటన జరిగింది. కొలతూరుకి చెందిన మనోజ్ కొన్ని రోజుల క్రితం నుంచి కోడిని పెంచుకుంటున్నాడు. అయితే ఈ కోడి ఇటీవల ఈ నాలుగు గంటల సమయంలో మొత్తం 11 గుడ్లు పెట్టింది. ఆ గుడ్లలో 10 మాములు సైజులో ఉండగా అందులో ఒక గుడ్డు మాత్రం కాస్త పెద్ద సైజులో ఉంది. ఈ కోడి గురించి తెలిసిన స్థానికులు దాన్ని చూసేందుకు వస్తున్నారు. కోడిని తాను 4 నెలల క్రితం బంధువుల ఇంటి నుంచి ఆ కోడిపెట్టను తీసుకొచ్చినట్లు మనోజ్ తెలిపారు. హార్మోన్ల ప్రభావం వల్లే సాధారణం కంటే ఎక్కువ గుడ్లను పెట్టి ఉంటుందని పౌల్ట్రీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.